Share News

Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:40 PM

కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.

Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే
Waqf Bill

దేశ వ్యాప్తంగా చర్చంతా వక్ఫ్ బిల్లుపై జరుగుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. ఓ వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ఎవరికి వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం చేసేందుకే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెబుతోంది. ఇప్పటికే గత ఏడాది ఈ బిల్లును లోక్‌సభ ముందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై సమగ్రంగా చర్చ జరగాలని మిగతా రాజకీయ పార్టీలు కోరడంతో చివరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును లోక్‌సభ నివేదించింది.


జేపీసీ వివిధ పార్టీలతో చర్చల అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా ఏప్రియల్ 2వ తేదీన కేంద్రం మరోసారి లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును ఆమోదింపచేసుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఏది ఏకమైనప్పటికీ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో సవరణలను ఆమోదింపజేసుకోవడం కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌కు కత్తిమీదసాములా మారింది. ఈ దశలో ఏప్రియల్ 2వ తేదీన ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతున్న క్రమంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం.


గతంలో

కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపగా.. వివిధ పార్టీలు, మత సంస్థలు, ప్రముఖ వ్యక్తులతో సుదీర్ఘ చర్చల తర్వాత వక్ఫ్ బిల్లు ముసాయిదాను జేపీసీ రూపొందించింది. వక్ఫ్ బిల్లుపై చర్చల సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భాలు చూశాం. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.


సంఖ్యాబలం

లోక్‌సభలో ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల సంఖ్య 543 కాగా వీరిలో స్పీకర్‌ను మినహాయిస్తే ఓటింగ్‌లో పాల్గొనేవారి సంఖ్య 542. వీరిలో బీజేపీ సంఖ్యా బలం 240, మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే ఎంపీల సంఖ్య 294. లోక్‌సభలో ఏదైనా బిల్లు ఆమోదించాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే మిత్రపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే తప్పనిసరిగా లోక్‌సభలో ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్‌కు గరిష్టంగా 99 మంది ఎంపీలు ఉండగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిపి వారి బలం 233. ఎన్డీయే, ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాని కొందరు ఎంపీలున్నారు. వీరు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే రాజ్యసభలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఎగువసభలో సంఖ్యాబలం 236 వీరిలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు 98 మంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపితే వీరి సంఖ్య 115. ఆరుగురు నామినేటెడ్ సభ్యులను కలుపుకుంటే ఎన్డీయే బలం 121 అవుతుంది.


రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించాలంటే 119 మంది సభ్యులు అవసరం. ఈ పరిస్థితుల్లో సాధారణ మెజార్టీతో పోల్చుకుంటే ఇద్దరు సభ్యుల బలం ఎక్కువుగా ఉంది. విపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి 27మంది రాజ్యసభ సభ్యులు ఉండగా ఇండియా కూటమి నుంచి 85 మంది ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి ప్రస్తుతం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉండగా, బీజేడీ నుంచి మరో ఏడుగురు, అన్నాడీఎంకే నుంచి నలుగురు సభ్యులు ఉన్నారు. ఏ కూటమిలో భాగస్వా్మ్యం కాని మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరంతా వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా.. వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఉన్న సంఖ్యా బలం ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అవసరమైన సంఖ్యా బలం ఎన్డీయేకు ఉంది. కూటమిలో అన్ని పక్షాలు బిల్లుకు మద్దతుగా నిలుస్తాయో లేదో అనేది కేంద్రప్రభుత్వాన్ని కలవరపెడుతున్న అంశంగా చూడొచ్చు. ఇప్పటికే బుధవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.


బీఏసీకి దూరంగా

వక్ఫ్ బిల్లుపై చర్చా సమయం, పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయింపుపై చర్చించేందుకు స్పీకర్ బీఏసీ సమావేశానికి పిలుపునివ్వగా విపక్షాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. కాంగ్రెస్ బాటలోనే ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.

ఇవి కూడా చదవండి

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 01 , 2025 | 03:40 PM