Supreme Court: ఆ 25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:13 PM
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25 వేల మంది ఉపాధ్యాయుల ఎంపిక చెల్లదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ఈ స్కామ్ ఎక్కడ వెలుగు చూసింది.. ఎప్పుడు చోటు చేసుకుంది వంటి వివరాలు మీ కోసం..

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సుమారు 25 వేల మంది టీచర్ల నియమాకాలు చెల్లవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో పశ్చిమబెంగాల్ దీదీ సర్కార్‌కు భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేసిన స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కామ్ కేసులో గురువారం నాడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2016లో వెలుగు చూసిన స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కామ్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలక్ట్ అయిన సుమారు 25 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమాకాలను రద్దు చేస్తూ.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీదీ సర్కార్‌కు ఇది భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల అధ్వర్యంలోని ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నియామక ప్రక్రియ, ఉద్యోగాల కేటాయింపు.. ఇలా ఎక్కడ చూసినా మోసపూరిత విధానాలే అవలంబించారు అని అసహనం వ్యక్తం చేసింది.
"ఈ స్కామ్‌లో భాగంగా నియమితులైన 25 వేల మంది టీచర్ల నియమాకాలు చెల్లవంటూ గతంలో కోల్‌కతా హైకోర్టు వెల్లడించిన తీర్పులో.. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. వారి నియమాకాలే పెద్ద మోసం అని అర్థం అవుతుంది. కాకపోతే.. ఇలా నియమాకాలు పొందిన అభ్యర్థులు.. ఇన్నాళ్లుగా వారు పొందిన జీతాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ" సుప్రీంకోర్టు ఉరట కలిగించింది. అలానే వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారు.. సర్వీసులో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక మూడు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామక ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో గతేడాది అనగా 2024, ఏప్రిల్‌లో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం.. 2016లో వెస్ట్ బెంగాల్ ఎస్ఎస్‌సీ బోర్డు ద్వారా చేపట్టిన టీచర్ నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేయడమే కాక.. అభ్యర్థుల నియామకాలను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగం పొందిన వారు.. అలానే బ్లాంక్ ఓఎమ్మార్ షీట్స్ సబ్మిట్ చేసి.. ఉద్యోగాలు పొందిన వారి నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా మోసపూరితంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఇన్నాళ్ల పాటు పొందిన వేతనాన్ని 12 శాతం వడ్డీరేటుతో కలిపి.. తిరిగి చెల్లించాలని పశ్చిమ బెంగాల్ హైకోర్టు స్పష్టం చేసింది.
దీన్ని సవాలు చేస్తూ.. దీదీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ ఆమెకు చుక్కెదురయ్యింది. ఈ స్కామ్‌లో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ.. 25 వేల మంది నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఆంటీకి, అమ్మాయికి మధ్య వింత పోటీ.. చివరకు ఏమైందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్.. ఆమెనే ప్రేయసి అంటూ..