స్వచ్ఛమైన పరిష్కారం
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:41 AM
ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు, నగరం శివార్లలో పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో నానాటికీ తీవ్రమవుతున్న ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అనే ఆలోచన చాలాకాలం మానా షాను వెంటాడింది...

పరిసరాలను అసహ్యంగా మార్చడంతోపాటు పౌరుల ఆరోగ్యానికి కూడా పెనుముప్పు కలిగిస్తున్న వ్యర్థాల సమస్యకు వినూత్నమైన పరిష్కారంతో ముందుకొచ్చారు ముంబయి మహిళ మానా షా. ఆమె చొరవతో యాభైకి పైగా హౌసింగ్ సొసైటీలు, అనేక కార్పొరేట్ సంస్థలు చెత్త ఇబ్బందుల నుంచి విముక్తి పొందాయి. అంతేకాదు... ప్రతినెలా 500 టన్నులకు పైగా సేకరిస్తున్న వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చి, ఉచితంగా అందిస్తున్నారు.
ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు, నగరం శివార్లలో పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో నానాటికీ తీవ్రమవుతున్న ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అనే ఆలోచన చాలాకాలం మానా షాను వెంటాడింది. 2006లో ‘యాన్ ఇన్‌కన్వీనియెంట్ ట్రూత్’ అనే డాక్యుమెంటరీ చూశాక... సమస్య తీవ్రత ఆమెకు మరింత బాగా అర్థమయింది. ‘‘మన దేశంలోని తీరప్రాంతాల్లో నివసిస్తున్నవారు సముద్ర మట్టాలు పెరగడం వల్ల ముప్పును ఎదుర్కొనే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. భారీ పరిమాణాల్లో వ్యర్థాలను తీర ప్రాంతాల్లో పారేస్తూ ఉండడంతో ఆ ప్రమాదం చాలా వేగంగా పెరుగుతోంది. అలాంటి టాప్ 10 నగరాల్లో ముంబయి ఒకటని తెలియగానే నేను దిగ్ర్భాంంతి చెందాను. నేను పుట్టి పెరిగిన నగరానికి ఆ దుస్థితి రాకూడదనుకున్నాను’’ అంటారామె.
కుటుంబ వ్యాపారాన్ని వదిలేసి...
మానా షాది వ్యాపారుల కుటుంబం. ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు పెట్రోల్ బంకులు నిర్వహిస్తారు. ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. తండ్రి మార్గదర్శకత్వంలో ఆమె కూడా ఆ మార్గంలోకే వచ్చారు. ఫ్యాక్టరీ కార్యకలాపాలు, వినియోగదారుల సేవల్ని ఆమె చూసేవారు. క్రమంగా ప్రెసిడెంట్ హోదాకు చేరుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, వ్యాపారంలో ఒత్తిడులు ఒకవైపు... సొంత నగరానికి ఏదైనా మంచి చెయ్యాలనే కోరిక మరొకవైపు... చివరకు ఆమెలోని సేవా దృక్పథమే గెలిచింది. రెండేళ్ళపాటు అధ్యయనం చేసిన తరువాత... 2010లో ‘గ్రీన్ ప్రాక్టీసెస్’ అనే సంస్థను ఆమె ప్రారంభించారు. నగరంలో వివిధ కాలనీలను సందర్శించారు. హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో మాట్లాడారు. చెత్తను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పారెయ్యడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ‘‘మనం చెత్తను దూరంగా పారేస్తున్నామని అనుకుంటాం. కానీ ‘దూరం’ అనే మాటకు అర్థం లేదు. అది మన ఊరు దాటి వెళ్ళదు. తన దుష్ఫలితాలను మన మీదకు పంపిస్తుంది. ఏ సమాజంలోనైనా వ్యర్థాల నిర్వహణ చాలా కీలకం’’ అని చెబుతారు మానా. ఇంటికే వచ్చి చెత్త తీసుకువెళ్తామని చెబితే ఎవరు కాదంటారు? మొదట ఒక ప్రాంతంతో మొదలైన ఈ కార్యక్రమం... ప్రస్తుతం 50కిపైగా హౌసింగ్ సొసైటీలకు విస్తరించింది. అంతేకాదు... రిలయన్స్, స్విగ్గీ లాంటి ప్రముఖ సంస్థలకు కూడా గ్రీన్ ప్రాక్టీసెస్ సేవలు అందిస్తోంది.
చైతన్యం పెరుగుతోంది...
ఆచరణాత్మకమైన ప్రణాళిక, అమలులో కచ్చితత్వమే తమ ప్రయత్నం విజయవంతం కావడానికి దోహదం చేశాయంటారు మానా. ‘‘రోజూ ట్రక్కులు కాలనీలకు, సంబంధిత సంస్థల కార్యాలయాల దగ్గరకు వస్తాయి. చెత్తను సేకరించిన తరువాత... దాన్ని నిర్ణీత ప్రదేశాలకు మా సిబ్బంది తీసుకువస్తారు. అక్కడ ఆహార, ఆహారేతర పదార్థాలను విడదీస్తారు. ఆహారేతర పదార్థాల్లో లోహాలు, కాగితాలు, ప్లాస్టిక్, గాజు... ఇలా వివిధ పదార్థాలను వేరు చేస్తారు. వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపిస్తారు. ఆహార వ్యర్థాలను వేరే కేంద్రానికి తెచ్చి కంపోస్ట్ తయారు చేస్తారు. కంపోస్టింగ్‌కు సాధారణంగా ఆరు నెలలు పడుతుంది. కానీ మేం నిర్దిష్టమైన మైక్రోబ్స్ వినియోగంతో దాన్ని నెల రోజులకు కుదించాం. అలా ఆహార వ్యర్థాలను పోషకాలతో నిండిన కంపోస్ట్‌గా మార్చి... కాలనీలకు, సంస్థలకు ఉచితంగా అందజేస్తాం. దాన్ని ఆరుబయట ఉండే తోటలకు, ఇళ్ళలో పెంచే మొక్కలకు ఎరువుగా దాన్ని వినియోగిస్తున్నారు. వ్యర్థాల రవాణా, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల కోసం ఇంటికి రూ. వంద చొప్పున వసూలు చేస్తున్నాం. దానికి బదులుగా కంపోస్ట్ అందజేస్తున్నాం. మరోవైపు వీధుల్లో, నగర శివార్లలో ఉన్న చెత్త కుప్పలను రీసైకిల్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం’’ అంటున్నారు మానా. ఆమె కృషితో ప్రస్తుతం నెలకు 500 టన్నుల చెత్త సేకరణ, రీసైక్లింగ్ జరుగుతోంది.
కొన్ని పదుల మందికి ఉపాధి లభిస్తోంది. ‘‘కుటుంబ వ్యాపారాలను వదిలేసినందుకు ఎన్నడూ చింతించలేదు. నేను చేస్తున్న పనికి గర్వపడుతున్నాను. గతంలోకన్నా ఇప్పుడు ప్రజలలో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత పట్ల చైతన్యం పెరుగుతోంది. ఇది మంచి పరిణామం. ఇళ్ళలోని వ్యర్థాలు చెత్త కుప్పల మీదకు వెళ్ళకూడదనేదే నా లక్ష్యం. మరిన్ని హౌసింగ్ సొసైటీలతో, వ్యక్తులతో భాగస్వామ్యం కావడం ద్వారా... నా ప్రయత్నాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నాను. ఆ దిశగా పని చేస్తున్నాను’’ అని చెబుతున్నారు మానా.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..