టైమ్ మిషన్‌లో వెనక్కి...
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:41 AM
చెన్నైలో ఉన్న ఆ షాప్‌లోకి అడుగు పెట్టగానే... ఒకప్పటి ఫస్ట్‌లైన్ బీచ్ వీధి, మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్, మౌంట్ రోడ్, మెరీనా బీచ్... మొదలైన ఒకప్పటి మద్రాస్ ఛాయాచిత్రాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఇక షాపు లోపల పూర్తిగా పురాతన వస్తువులే.

గాంధీజీ స్థాపించిన ‘హరిజన్’ వారపత్రిక, రాణులు ధరించిన దుస్తులు, రాజమందిరాల్లోని ఖరీదైన దీపాలు, మొఘల్ మిని యేచర్‌లు, ఆయుధాలు, సామాగ్రి... వీటి గురించి చరిత్ర పుస్తకాల్లో చదవడమే గానీ... చూసింది లేదు. ఇలాంటి ఎన్నో అపురూప వస్తువులను స్వయంగా చూసి, వాటి చరిత్రను తెలుసుకోవాలను కుంటే... చెన్నైలోని ‘ది ఓల్డ్ క్యూరియాసిటీ షాప్’లోకి వెళ్లాల్సిందే!
చెన్నైలో ఉన్న ఆ షాప్‌లోకి అడుగు పెట్టగానే... ఒకప్పటి ఫస్ట్‌లైన్ బీచ్ వీధి, మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్, మౌంట్ రోడ్, మెరీనా బీచ్... మొదలైన ఒకప్పటి మద్రాస్ ఛాయాచిత్రాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఇక షాపు లోపల పూర్తిగా పురాతన వస్తువులే. అరల్లోనే కాదు... ఎక్కడ, ఏ మూలన చూసినా అరుదైన పాత వస్తువులే కనిపిస్తాయి. వాటిలో కొన్ని వందల ఏళ్లనాటివి కూడా ఉన్నాయి. తొలితరం టేప్‌రికార్డర్, విద్యుత్ అవసరమే లేకుండా సంగీతం వినిపించే వందల ఏళ్లనాటి గ్రామఫోన్ ప్లేయర్, రెండు వందల ఏళ్లనాటి టెలీస్కోప్, 1885 నాటి బైనాక్యులర్, ప్రపంచంలోని తొలి ఫొటో కెమెరా... ఇలా అనేక వస్తువులు అక్కడ కొలువుదీరాయి. మొత్తానికి సందర్శకులకు ఓ మినీ మ్యూజియంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.
ఎన్నో వస్తువులు...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, మడిచి జేబులో పెట్టుకునే ప్యాకెట్ గడియారాలు, కెమెరాలు, రేడియోలు, టేప్‌రికార్డర్లు, వివిధ అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు... అన్నింటినీ కూడా వింతగా చూస్తుండిపోతాం. ఎందుకంటే అలాంటి పీస్ ఇప్పటిదాకా ఎక్కడా చూసి ఉండరు. వీటితో పాటు పురాతన శిల్పాలు, కాలిక్యులేటర్లు, శాలువలు, అందమైన తివాచీలు, రగ్గులు, ప్రసిద్ధ పుస్తకాలు, ప్రొజెక్టర్లు, ఆభరణాల పెట్టెలు, తొలితరం ఫిల్మ్ కెమెరాలు, పాత కాలపు పోస్టర్లు, మ్యాప్‌లు, బ్యాడ్జ్‌లు, రాక్ మ్యూజిక్ రికార్డులు... అలా షాపులో ఉన్న వాటిని చూస్తుంటే సమయమే తెలియదు. అంతేకాదండోయ్... గాంధీజీ స్థాపించిన ‘హరిజన్’ వారపత్రిక మొదటి సంచిక, ‘హ్యారీ పోటర్’ సిరీస్ మొదటి ఎడిషన్, కింగ్ చార్లెస్, ప్రిన్సెస్ డయానాల వివాహ చిత్ర పటం, భారతీయ కవి మీర్జా గాలిబ్ రాసిన వందేళ్ల నాటి పుస్తకం, గాంధీ రాసిన ‘ఢిల్లీ డైరీ’ పుస్తకం మొదటి ఎడిషన్, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వహస్తాలతో రాసిన లేఖ ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. వాటిల్లో నచ్చినవాటిని కొనుక్కోవచ్చు కూడా. 50 రూపాయల నుంచి లక్షల ఖరీదైనవి కూడాఉన్నాయి.
గిఫ్ట్ షాప్‌గా మొదలై...
ఒకప్పుడు ఇదొక చిన్న గిఫ్ట్ షాప్. ఒకరకంగా తమిళనాడులో మొదటి గిఫ్ట్ షాప్ ఇదే. 1940లలో కశ్మీర్ నుంచి చెన్నైకు వలస వచ్చిన గులామ్ మహ్మద్ ఈ షాప్‌ను ప్రారంభించారు. మొదట్లో బొమ్మలు, కళ్లద్దాలు, ఫౌంటెన్ పెన్నుల వంటివి అమ్మేవారు. ఆ తర్వాత మార్కెట్‌లో ఎక్కడా దొరకని అరుదైన వస్తువులు సేకరించి అమ్మడం మొదలెట్టారు. వాటిని కొనుగోలు చేసేందుకు అప్పట్లో బ్రిటీషర్లు, ధనికులు వచ్చేవారట. ఇక్కడ లభించే కశ్మీరీ హస్తకళల కోసం విదేశీయులు ఈ షాప్‌కు క్యూ కట్టేవారట. అందుకే అప్పట్లో దీన్ని ‘కశ్మీర్ ఆర్ట్ ప్యాలెస్’ అనేవారు. క్రమ క్రమంగా కళాప్రియుల సంఖ్య పెరగడంతో, వారి డిమాండ్ మేరకు పురాతన వస్తువులను సేకరించడం మొదలెట్టాడు మహ్మద్. అప్పటి నుంచి ‘ఓల్డ్ క్యూరియాసిటీ షాప్’గా మారింది. గులామ్ మహ్మద్ తర్వాత ఆయన కొడుకు... ప్రస్తుతం ఆయన మనవడు లతీఫ్ మహ్మద్ వారసత్వంగా దీన్ని నడుపుతున్నారు. తాతలాగే ఇతడికీ పురాతన వస్తువుల సేకరణపైమక్కువ ఉంది. దేశ, విదేశాల్లో పర్యటించి ఎన్నో వస్తువులను సేకరించాడు. అలా ఇప్పటివరకు ఎన్నో అరుదైన వస్తువులు సేకరించి,ప్రదర్శనకు ఉంచాడు. గత 80 ఏళ్లుగా పురాతన వస్తువుల నిలయంగా మారిందీ షాప్.
సినిమావాళ్ల ఫేవరేట్ స్పాట్...
పాత కాలపు సినిమాలు తీయాలనుకునే వాళ్లకు ఈ షాప్ ఒక కేంద్రబిందువుగా మారింది. దర్శకులు, ఆర్ట్ డైరెక్టర్లు తమకు కావాల్సిన వస్తువులు, సమాచారం కోసం లతీఫ్‌ను కలుస్తుంటారు. తమిళ హీరో ఆర్య నటించిన ‘మద్రాసపట్టినం’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సహా పలు పీరియాడిక్ సినిమాలకు లతీఫ్ పురాతన వస్తువులు అందించారు. అలాగే ఈ షాప్ చాలామంది ప్రముఖులకు విజిటింగ్ స్పాట్‌గా మారింది. న్యాయమూర్తులు, సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు... ఎవరైనా చెన్నైకి వెళ్తే ఈ షాప్‌ను సందర్శిస్తుంటారు. టైమ్ మిషన్‌లో గతానికి వెళ్లడం ఎవరికైనా సరదాగానే ఉంటుంది కదా!
‘‘పురాతన వస్తువులను సేకరించటం నాకు చాలా ఆనం దాన్నిస్తుంది. అలాంటిది ఏదైనా కనిపిస్తే వెంటనే తీసుకొచ్చి షాప్‌లో పెట్టేస్తా. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో కూడా కొంటుంటా. కస్టమర్లకు ఆయా వస్తువులకు సంబంధించిన చరిత్రను వివరిస్తుంటా. నిజానికి భావితరాల కోసమే నేను వీటిని సేకరిస్తున్నా. పాతవాటి ఆధారంగానే కొత్త వస్తువుల రూపకల్పనలో మార్పులు ఉంటాయి. కాబట్టి వాటిని భద్రపరిస్తేనే కొత్తవి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారిలో ఎక్కువమంది విద్యార్థులే. వారిలో స్ఫూర్తి నింపేందుకే తత్వవేత్తలు, ప్రముఖ రచయితలకు సంబం ధించిన కోట్స్‌ను గోడలకు అతికించా.’’
- లతీఫ్ మహ్మద్
ఈ వార్తలు కూడా చదవండి:
పోస్టల్ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!
కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి
మెట్రో రైల్‌పై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆపండి
Read Latest Telangana News and National News