Ayush Mhatre: ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన బచ్చా బ్యాటర్.. ఏం కొట్టాడు రా బాబు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:43 PM
Ayush Mhatre Record: డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ఓ 17 ఏళ్ల కుర్రాడు ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏకంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డును తుడిచి పెట్టేశాడు. ఎవరా కుర్రాడు అనేది ఇప్పుడు చూద్దాం..

రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికేనని కొందరు ఆటగాళ్లు నిరూపిస్తుంటారు. చెక్కు చెదరకుండా ఉన్న అరుదైన రికార్డులకు అద్భుతమైన ఆటతీరుతో పాతర పెడుతుంటారు. స్టన్నింగ్ బ్యాటింగ్, బౌలింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంటారు. దీంతో అన్‌బ్రేకబుల్‌గా అనిపించే ఫీట్లు కూడా వాళ్ల ధైర్యం, సాహసం, ప్రతిభ ముందు బ్రేక్ అయిపోతాయి. మరోసారి ఇదే జరిగింది. భారత డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. ఓ 17 ఏళ్ల కుర్రాడు ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏకంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డును తుడిచి పెట్టేశాడు. ఎవరా కుర్రాడు? అతడు బద్దలుకొట్టిన రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆకాశమే హద్దుగా..
విజయ్ హజారే ట్రోఫీ ముంబై-నాగాలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. 17 ఏళ్ల ముంబై ఓపెనర్ ఆయుష్ మాత్రే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 117 బంతుల్లోనే ఏకంగా 181 పరుగులు చేశాడు. ఇందులో 15 బౌండరీలతో పాటు 11 భారీ సిక్సులు ఉన్నాయి. 154 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన మాత్రే.. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలించాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే అతడు 126 పరుగులు రాబట్టుకోవడం విశేషం. దీన్ని బట్టే అతడి హిట్టింగ్ ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
జైస్వాల్‌ను దాటేశాడు!
భారీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ఆయుష్ మాత్రే.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 150 ప్లస్ స్కోర్ చేసిన యంగ్ బ్యాటర్‌గా అతడు హిస్టరీ క్రియేట్ చేశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో ఆయుష్ తాజా ఇన్నింగ్స్ ఆడాడు. అదే జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150కి పైగా స్కోర్ చేశాడు. అతడు కూడా ముంబై తరఫున ఆడుతూనే అరుదైన ఫీట్ నెలకొల్పడం విశేషం. 2019లో ఝార్ఖండ్‌తో మ్యాచ్‌లో ఈ రికార్డును క్రియేట్ చేశాడు జైస్వాల్. తాజాగా నాగాలాండ్‌తో మ్యాచ్‌లో 181 పరుగులతో ఆ అతడ్ని అధిగమించాడు ఆయుష్. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 403 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన నాగాలాండ్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 214 పరుగులు మాత్రమే చేయగలిగింది.