Quarterfinal Defeat: ముగిసిన భారత్ పోరు
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:47 AM
ఎన్నో అంచనాలతో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన భారత షట్లర్లు నిరాశపరిచారు. సింగిల్స్‌లో మిగిలిన మాజీ రన్నరప్ లక్ష్య సేన్..

లక్ష్య సేన్, గాయత్రి జోడీ అవుట్
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్
బర్మింగ్‌హామ్: ఎన్నో అంచనాలతో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన భారత షట్లర్లు నిరాశపరిచారు. సింగిల్స్‌లో మిగిలిన మాజీ రన్నరప్ లక్ష్య సేన్, డబుల్స్‌లో ఆశలు రేపిన పుల్లెల గాయత్రి గోపీచంద్/ట్రీసా జాలీ జోడీ సెమీఫైనల్స్ చేరకుండానే నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్య సేన్ 10-21, 16-21తో చైనాకు చెందిన ప్రపంచ ఆరో ర్యాంకర్ లి షి ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2022 ఫైనలిస్టు అయిన లక్ష్య.. 45 నిమిషాలపాటు సాగిన ఏకపక్ష పోరులో ప్రత్యర్థి ధాటికి ఏ దశలోనూ బదులివ్వలేక వరుస గేముల్లో వెనుదిరిగాడు.
కాగా, మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి/ట్రీసా ద్వయం 14-21, 10-21తో చైనా జోడీ, రెండో సీడ్ లూ షెంగ్షూ/టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైంది. సింగిల్స్‌లో పీవీ సింధు, ప్రణయ్ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో భారత షట్లర్ల పోరు పూర్తిగా ముగిసినట్టయింది.