Share News

Womens Premier League: ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మహిళల జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:55 AM

నెల రోజులపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మూడో సీజన్‌ ఆఖరి అంకానికి చేరుకుంది.

Womens Premier League: ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మహిళల జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌

ఒకటా.. రెండా?

తొలి టైటిల్‌ కోసం ఢిల్లీ ఆరాటం

రెండోసారి మురిసేందుకు ముంబై ప్రయత్నం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌

నేడు ఇరు జట్ల మధ్య ఫైనల్‌

ముంబై: నెల రోజులపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మూడో సీజన్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మహిళల జట్ల మధ్య ఫైనల్‌ ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా జరుగనుంది. 2023లోనూ ఈ రెండు జట్ల మధ్యే తుది పోరు జరగ్గా ముంబై తొలిసారి విజేతగా నిలిచింది. ఇక వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ ఈ లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిలకడైన జట్టుగా పేరు తెచ్చుకుంది. కానీ అన్నిసార్లూ రన్నర్‌పగానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలోని ఈ టీమ్‌ ఈసారి మాత్రం కప్‌ కొట్టాల్సిందేనన్న కసితో ఉంది. తాజా సీజన్‌లో ఈ రెండు జట్లు అన్ని విభాగాల్లోనూ సమవుజ్జీలుగా కనిపించాయి. ఇరుజట్లు లీగ్‌లో తామాడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటముల చొప్పున ఉండడం గమనార్హం. రన్‌రేట్‌ పరంగా మాత్రమే డీసీ నేరుగా తుది పోరుకు అర్హత సాధించింది. అయితే ఆర్‌సీబీ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత ముంబై ఎలిమినేటర్‌లో ఆడి అదిరే ఆటతో తిరిగి ఫైనల్లోకి అడుగుపెట్టింది. స్టార్‌ ఆల్‌రౌండర్లతో కూడిన ఈ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.


సీనియర్ల అండతో..

రెండోసారి ఫైనల్‌కు చేరిన ముంబై జట్టులో సీనియర్లు నాట్‌ సివర్‌ బ్రంట్‌, ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో సివర్‌ 493 రన్స్‌, 9 వికెట్లు.. మాథ్యూస్‌ 304 రన్స్‌, 17 వికెట్లతో అదుర్స్‌ అనిపించారు. అటు హర్మన్‌ 156.29 స్ట్రయిక్‌ రేట్‌తో 236 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ ఈ త్రయం బ్యాట్లు ఝళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో అమేలియా, షబ్నిం, సైకా రాణిస్తున్నారు.

తుది జట్లు (అంచనా)

ముంబై: యాస్తిక భాటియా, మాథ్యూస్‌, సివర్‌, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), సజన, అమేలియా, అమన్‌జ్యోత్‌, కమలిని, సంస్కృతి, షబ్నిం ఇస్మాయిల్‌, సైకా ఇషాక్‌.

ఢిల్లీ: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, సదర్లాండ్‌, కాప్‌, జొనాసెన్‌, సారా బ్రైస్‌, నికీ ప్రసాద్‌, శిఖా పాండే, మిన్ను మణి, టిటాస్‌ సాధు.

ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ

ముంబైతో జరిగిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన డీసీ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈసారి హ్యాట్రిక్‌ విజయంతో తమ టైటిల్‌ స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనుకుంటోంది. ఓపెనర్లు లానింగ్‌, షఫాలీలతో పాటు జెమీమా, సదర్లాండ్‌, కాప్‌లతో బ్యాటింగ్‌ విభాగం బలంగానే కనిపిస్తోంది. అటు ముంబై బ్యాటింగ్‌ పవర్‌ను కట్టడి చేసేందుకు డీసీ పేసర్లు జొనాసెన్‌, సదర్లాండ్‌, కాప్‌, శిఖా, స్పిన్నర్‌ మిన్ను సిద్ధంగా ఉన్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో వీరి బౌలింగ్‌ను ముంబై దీటుగా ఎదుర్కోలేకపోయింది.

Updated Date - Mar 15 , 2025 | 01:59 AM