BJP: ఉప్పలమ్మా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయమ్మా
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:37 AM
భారతీయ జనతా పార్టీ నేతలు వినూత్న తరహాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డివిజన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఉప్పలమ్మా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయమ్మా.. అంటూ అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు.

- అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించమ్మా..
- అమ్మవారికి వినతిపత్రం సమర్పించిన బీజేపీ నేతలు
హైదరాబాద్: ‘ఉప్పలమ్మా.. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో విచ్చలవిడిగా చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయమ్మా.. అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించమ్మా’.. అని కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ(BJP) నేతలు అమ్మవారిని వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ బడంగ్‌పేట్(Badangpet)శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్పొరేషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, కార్యాలయం ఆవరణలోని ఉప్పలమ్మ ఆలయంలో అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పెళ్లి పేరుతో యువతిని నిర్భందించి.. ఆపై
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బడంగ్‌పేట్‌లో అవినీతి, అక్రమాలు పేట్రేగిపోయాయని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆరోపించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్ స్థలాలు, నాలాలు, రోడ్లు కబ్జాకు గురవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పలు కాలనీల్లో ఎస్‌ఎన్‌డీపీ నాలా ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలిపోవడంతో స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు అందజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయా అంశాలపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని, అభివృద్ధిపై అధికారులు శ్రద్ధ పెట్టేలా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో పార్టీ బడంగ్‌పేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు నడికుడ యాదగిరి, వెంకట్‌రెడ్డి, పోరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, కొంతం సంపత్‌రెడ్డి, రేసు నర్సింహారెడ్డి, కుంటె భాస్కర్, సురేందర్‌రెడ్డి, సైదులు, రాజ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్, ప్రవీణ్‌గౌడ్, మహేందర్, బాపనయ్య పాల్గొన్నారు.
శ్రీరాముడి ఫ్లెక్సీ తొలగింపుపై నిరసన
శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకుని బడంగ్‌పేట్ పాత గ్రామ పంచాయతీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి ఫ్లెక్సీ బ్యానర్‌ను మునిసిపల్ సిబ్బంది తొలగించడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శోభాయాత్ర ముగియక ముందే ఎలా తొలగిస్తారని అధికారుల తీరుపై మండి పడ్డారు. బ్యానర్ తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మునిసిపల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News