CAG: సర్కారు ఖాతాతో కార్పొరేషన్ల రుణాల చెల్లింపా?
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:01 AM
కార్పొరేషన్ల పేర తీసుకుంటున్న గ్యారెంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాల్లో ఎక్కడా కనిపించడం లేదు కానీ, అసలు, వడ్డీ చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయని తెలిపింది.

అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులు ఉండట్లే
ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారెంటీ అప్పులు కనిపించట్లే
చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయ్!
గ్యారెంటీలు ఇచ్చినందుకు సర్కారుకు ఫీజు ఏదీ?
మొత్తం రాష్ట్ర అప్పులు రూ.6.24 లక్షల కోట్లు
కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే 15.90ు సొమ్ము
పరిమితికి మించి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
2023-24కి రాష్ట్ర ఆర్థిక స్థితిపై ‘కాగ్’ నివేదిక
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్ల పేరిట సేకరించిన రుణాలకు ప్రభుత్వ ఖాతాల నుంచి అసలు, వడ్డీలు చెల్లించడాన్ని ‘కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ తప్పు పట్టింది. ఇలా చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖాతాలో సరైన నిల్వలు ఉండడం లేదని ఆక్షేపించింది. కార్పొరేషన్ల పేర తీసుకుంటున్న గ్యారెంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాల్లో ఎక్కడా కనిపించడం లేదు కానీ, అసలు, వడ్డీ చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయని తెలిపింది. ఇది ప్రభుత్వ ఖాతాలోని నిల్వపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రభుత్వ అప్పులను తక్కువ చేసి చూపుతున్నట్లు అర్థమవుతుందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఖాతాలపై కాగ్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర అప్పులు, గ్యారెంటీ అప్పులు, రాబడులు, వ్యయాలు, మూలధన వ్యయం తదితర అంశాలను కాగ్ వివరించింది. తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రభుత్వ ఖాతాలో చాలా తక్కువ నిల్వ కనిపిస్తోందని తెలిపింది. 2024 మార్చి 31 నాటికి అప్పుల సొమ్ము నిల్వ రూ.969 కోట్లు మాత్రమే కనిపించాయని.. ఇందులో తెలంగాణ విద్యుత్తు ఆర్థిక సంస్థ రుణానికి సంబంధించి రూ.422 కోట్లు, ట్రాన్స్‌కో బాండ్లకు సంబంధించి రూ.502 కోట్లు ఉన్నాయని వివరించింది. ప్రతికూల నిల్వ వంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండడానికి బడ్జెట్‌లో సరైన నిబంధనలను రూపొందించుకోవాలని సూచించింది.
ప్రభుత్వానికి గ్యారెంటీ ఫీజు/కమీషన్ ఏది?
కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి రావాల్సిన గ్యారెంటీ ఫీజు/కమీషన్ కూడా సరిగా రావడం లేదని కాగ్ పేర్కొంది. ఒక కార్పొరేషన్‌కు గ్యారెంటీ ఇచ్చిన అప్పు మొత్తం సొమ్ముపై 0.5 శాతం లేదా గ్యారెంటీ వ్యవధిపై 2 శాతం చొప్పున ఫీజు/కమీషన్‌ను ఆ కార్పొరేషన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 2023-24లో ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలకు గాను కార్పొరేషన్ల నుంచి రూ.2,960 కోట్ల కమీషన్ రావాల్సి ఉండగా.. వచ్చింది మాత్రం రూ.3 కోట్లేనని కాగ్ వెల్లడించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తూ రావడం వల్ల 2023-24 నాటికి రాష్ట్ర అప్పు రూ.6,24,271 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పుతోపాటు కార్పొరేషన్లు తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో 2023 మార్చి నాటికే రూ.3,50,520కోట్ల అప్పు ఉంది. కానీ, 2023-24లో మరో రూ.53,144కోట్ల తీసుకోవడంతో అది రూ.4,03,664కోట్లకు చేరింది. కార్పొరేషన్లు రూ.2,20,607 కోట్ల అప్పులు తీసుకున్నాయి.
7.32-7.75 శాతం వడ్డీతో రుణాలు
2023-24లో ప్రభుత్వం 7.32 నుంచి 7.75 శాతం వరకు వార్షిక వడ్డీ రేట్లతో రుణాలు తీసుకుందని కాగ్ వెల్లడించింది. 50 సార్లు రుణాలను సేకరించిందని, మొత్తం రూ.49,618 కోట్ల అప్పు తీసుకుందని వివరించింది. ఈ అప్పును 2030-2051 సంవత్సరాల మధ్య తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇవి కాకుండా ఎల్‌ఐసీ, జీఐసీ, నాబార్డు వంటి సంస్థల నుంచి మరో రూ.910 కోట్ల రుణం తీసుకుందని వెల్లడించింది. పాత అప్పులు, వడ్డీల కింద రూ.12,194 కోట్లను తిరిగి చెల్లించిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, అడ్వాన్సుల కింద మరో రూ.1,948 కోట్లు రాష్ట్రానికి అందాయని పేర్కొంది. మరోవైపు స్వల్పకాలిక రుణాలైన వేస్ అండ్ మీన్స్‌ను కూడా ప్రభుత్వం సేకరించిందని తెలిపింది. వీటి కింద 2023-24లో రూ.98,097కోట్ల అప్పు తీసుకుందని వివరించింది. అందులో రూ.97,098 కోట్లను చెల్లించిందని, వెయ్యి కోట్లు చెల్లించలేదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ కట్టడి..
రాష్ట్ర ప్రభుత్వ అప్పులను కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తూ వస్తోంది. 2023-24కుముందు మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు తీసుకోకుండా నియంత్రించినట్లు కాగ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. 2020-21లో రూ.43,464 కోట్లను అప్పుగా తీసుకున్న ప్రభుత్వం.. 2021-22లో రూ.44,122 కోట్లను మాత్రమే తీసుకోగలిగింది. 2022-23లో కూడా మరో రూ.2,801 కోట్లను పెంచి రూ.46,923కోట్లను తీసుకోగలిగింది. 2023-24లో మరో రూ.6,221 కోట్లను పెంచి, రూ.53,144 కోట్లను తీసుకుంది.
గత ఐదేళ్లుగా తీసుకున్న అప్పులు(రూ.కోట్లలో)
జీఎస్‌డీపీలోవాటి శాతాలు
సంవత్సరం పాత ఆ ఏడాదిలో మొత్తం జీఎస్‌డీపీలో
అప్పు తీసుకున్న అప్పు శాతం
201920 194958 37223 232181 24
202021 234554 43464 278018 28
202122 277489 44122 321611 28
202223 309563 46923 356486 28
202324 350520 53144 403664 27