Hyderabad: కుంట్లూరులో అ‘క్రమబద్ధీకరణ’పై కదలిన ‘రెవెన్యూ’
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:46 AM
హైదరాబాద్ శివారు కుంట్లూర్‌లో జీవో 59 పేరుతో జరిగిన భూభాగోతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్ 24లో భూమి అక్రమ క్రమబద్ధీకరణపై రెవెన్యూ యంత్రాంగం కదలింది.

ప్రభుత్వ భూమిని పరిశీలించిన యంత్రాంగం.. అక్రమ నిర్మాణాలపై ఆరా
నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్న తహసీల్దార్
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారు కుంట్లూర్‌లో జీవో 59 పేరుతో జరిగిన భూభాగోతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్ 24లో భూమి అక్రమ క్రమబద్ధీకరణపై రెవెన్యూ యంత్రాంగం కదలింది. పేదల కోసం తెచ్చిన జీవో 59ను అడ్డుపెట్టుకుని కొందరు ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకున్న వ్యవహారంపై ‘‘అక్రమబద్దీకరణకు రెక్కలు’’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఆర్‌ఐ నిజాముద్దీన్, సర్వేయర్‌తో కలిసి కుంట్లూరు సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా రెండెకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన హద్దులను పరిశీలించారు. 2015 సంవత్సరంలో 59జీవో ద్వారా క్రమబద్ధీకరించుకున్న 600 గజాల స్థలంతోపాటు 2022 సంవత్సరంలో 59 జీవో కింద మరోసారి దరఖాస్తు చేసుకున్న 3,635 గజాల స్థలాన్ని పరిశీలించారు.
క్రమబద్ధీకరణ కోసం ఫీజులు చెల్లించిన 3,635 గజాల్లో ఎలాంటి నిర్మాణాలు లేవని అధికారులు గుర్తించారు. 2015లో క్రమబద్ధీకరించుకున్న స్థలంలో పాత నిర్మాణాలతోపాటు కొత్త నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. జీవోలో క్రమబద్ధీకరించుకున్న స్థలంలో కాకుండా మరో చోటా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనాన్ని కూడా పరిశీలించారు. కాగా కుంట్లూరు సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిలో జీవో 59 ద్వారా జరిగిన అక్రమబద్ధీకరణపై పూర్తి విచారణ చేస్తున్నామని తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. గతంలో కూడా ఈ అంశంపై పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అప్పుడూ విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చామన్నారు. అక్రమబద్ధీకరణపై మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News