Digital Revolution: డిజిటల్ చానళ్ల విప్లవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:31 AM
ప్రస్తుతం మన దేశంలో ఒక విప్లవం నడుస్తోంది. దాని పేరే డిజిటల్ చానల్స్. ఈ విప్లవం ఏ స్థాయిలో ఉందంటే.. గతేడాది దేశ వినోద, మీడియా రంగం రూ.2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేయగా.. దాంట్లో అత్యధిక వాటా డిజిటల్ చానల్స్‌దే.

దేశ వినోద, మీడియా రంగంలో ఇప్పుడు ఇదే నంబర్‌వన్
ఆదాయపరంగా గతేడాది టీవీచానళ్లనూ దాటేసిన వైనం
డిజిటల్ యాడ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్న కార్పొరేట్ కంపెనీలు
తగ్గుతున్న ప్రింట్, టీవీ మీడియా మార్కెట్ వాటా, ఆదాయం
న్యూఢిల్లీ, మార్చి 28: ప్రస్తుతం మన దేశంలో ఒక విప్లవం నడుస్తోంది. దాని పేరే డిజిటల్ చానల్స్. ఈ విప్లవం ఏ స్థాయిలో ఉందంటే.. గతేడాది దేశ వినోద, మీడియా రంగం రూ.2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేయగా.. దాంట్లో అత్యధిక వాటా డిజిటల్ చానల్స్‌దే. వినోద, మీడియా రంగంలో ఎప్పుడూ తొలిస్థానంలో ఉండే టెలివిజన్ చానళ్లను దాటి వేసి డిజిటల్ చానల్స్ మొట్టమొదటిసారిగా నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీనికి కారణం.. జనం వినోదం కోసమైనా, వార్తల కోసమైనా ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు సెల్‌ఫోన్ స్ర్కీన్ చూస్తూ గడిపారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు ఐదు గంటలతో సమానం. ఈ ఐదు గంటల్లో దాదాపు 70ు సమయం సోషల్ మీడియా, గేమ్‌లు, వీడియోలను చూడటంతోనే గడుస్తోంది. ఈ వివరాల్ని బహుళజాతి కంపెనీ ‘ఈవై’ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పలు ఆసక్తికరమైన అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి.
అంతర్జాతీయంగా మూడోస్థానం
దేశ ప్రజలు మొబైల్‌ఫోన్‌ను చూడటానికి రోజువారీగా వెచ్చిస్తున్న సగటు సమయం ప్రకారం.. ప్రపంచంలో భారత్ మూడోస్థానంలో ఉంది. ఇండొనేషియా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, మొత్తంగా దేశం యావత్తూ సెల్‌ఫోన్ మీద గడిపిన సమయం ప్రకారం చూస్తే.. భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే, భారత్‌లో పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు టీవీ ప్రకటనలు, బిల్‌బోర్డుల కన్నా డిజిటల్ అడ్వర్జైటింగ్ మీద ఎక్కువ మొత్తం వ్యయం చేస్తున్నాయని పలు సర్వేల్లో వెల్లడవుతోంది.
ఇన్‌ఫ్లుయెన్సర్ల హవా
భారత్‌లో కొనసాగుతున్న డిజిటల్ విప్లవం కారణంగా.. లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు కొత్తగా రంగంలోకి వస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాల నుంచి సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూల వరకూ, విహారయాత్రల నుంచి సమకాలీన రాజకీయాల వరకూ.. వీరు ఏ అంశాన్నీ వదలటం లేదు. ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో.. దేశ వినోదరంగంలో ఓ భారీ పరిశ్రమనే రూపుదిద్దుకుంటోంది. ఇది కార్పొరేట్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటోంది. టీవీచానళ్లలో, పత్రికల్లో, బిల్‌బోర్డుల్లో ప్రకటనలు ఇచ్చే పాతధోరణి స్థానంలో.. తమ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులకు మాత్రమే తమ యాడ్ వెళ్లేలా వారు ఇప్పుడు ప్రకటనలు ఇవ్వగలుగుతున్నారు. మార్కెటింగ్ రంగంలో కంటెంట్ క్రియేటర్లు నేడు ఒక బలమైన శక్తిగా అవతరించారు.
వారు వినోదాన్ని అందించడమే కాక.. జనం ఏది కొనాలి? ఎక్కడ కొనాలి? ఏ బ్రాండ్ మంచిది? వంటి అంశాల్ని ప్రభావితం చేస్తున్నారు. అయితే, దీని ప్రభావం టెలివిజన్, పత్రికలు, రేడియో వంటి సంప్రదాయ మీడియాపై తీవ్రంగా పడుతోంది. 2024లో సంప్రదాయ మీడియా ఆదాయం, మార్కెట్ వాటా తగ్గినట్లుగా ఈవై నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యంత చవకగా మొబైల్ డేటా లభించటం ఈ డిజిటల్ విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. గతేడాది భారతీయుల సగటు డేటా వినియోగం నెలకు 27.5 జీబీగా నమోదైంది. దేశ జనాభాలో 42ు మంది (56.2 కోట్ల మంది) ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు సెల్‌ఫోన్ స్ర్కీన్ చూస్తూ గడిపారు. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు ఐదు గంటలతో సమానం.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News