Share News

Organ Donation: మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణదానం

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:02 AM

బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించి ముగ్గురికి ప్రాణదానం చేశారు. ఏపీలోని బాపట్ల పట్టణం వివేకానంద నగర్‌ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి(45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల ఆరో తేదీ గుంటూరులోని ఆస్టర్‌ రమేశ్‌ హాస్పిటల్స్‌లో చేరారు.

Organ Donation: మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణదానం

  • ఆస్టర్‌ రమేశ్‌ హాస్పిటల్‌లో మహిళ బ్రెయిన్‌ డెడ్‌

  • అవయవదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం

  • గ్రీన్‌ చానల్‌ ద్వారా సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తుల తరలింపు

గుంటూరు మెడికల్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించి ముగ్గురికి ప్రాణదానం చేశారు. ఏపీలోని బాపట్ల పట్టణం వివేకానంద నగర్‌ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి(45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల ఆరో తేదీ గుంటూరులోని ఆస్టర్‌ రమేశ్‌ హాస్పిటల్స్‌లో చేరారు. ఈ క్రమంలో ఆదివారం ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు వెద్యులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌దాన్‌ ప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అంత బాధలోనూ కుటుంబ సభ్యులు విశాల ధృక్పఽథంతో ఆలోచించి, తాము అంగీకరిస్తే జీవన్మరణ స్థితిలో ఉన్న ముగ్గురికి ప్రాణదానం చేసినట్టు అవుతుందని భావించి అవయవ దానానికి అంగీకరించారు.


దీంతో జీవన్‌దాన్‌ ప్రతినిధులు ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి, కాలేయం, మూత్రపిండాలను ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్‌కు కేటాయించారు. ఆదివారం రాత్రి పోలీసుల సహాకారంతో గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేసి ఊపిరితిత్తులను గన్నవరం ఎయిర్ట్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు పంపారు. ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ రాయపాటి మమత, క్లస్టర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ డాక్టర్‌ కార్తీక్‌ చౌదరి ఈ అవయవదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Updated Date - Mar 10 , 2025 | 04:02 AM