Big Scam: భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వీళ్ల ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:48 PM
తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని అమాయకులను కేటుగాళ్లు నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు.

హైదరాబాద్: నగరంలో మరో భారీ స్కామ్(Financial Investment Scam) వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Capital Protection Force Private Limited) పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫోంజి స్కీమ్ (Ponzi scheme)ను తీసుకువచ్చారు. ఏజెంట్లను నియమించుకుని అమాయకులకు వల పన్నారు.
తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు. కేవలం 45 నుంచి 180 రోజుల్లోనే 11 నుంచి 22 శాతం రిటన్స్ వస్తాయని చెప్పడంతో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. వారి మాటలు నమ్మిన 6,979 మంది ఏకంగా రూ.1,700 కోట్ల డిపాజిట్లు చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకూ పెట్టుబడుల పేరుతో వసూలు చేశారు కేటుగాళ్లు. అందినకాడికి దోచుకున్న తర్వాత ఈ ఏడాది జనవరి 15 క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులంతా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తమ నగదును ఎలాగైనా తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంస్థ వైస్ ప్రెసిడెండ్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. పట్టుపడిన ఇద్దరూ అమర్ దీప్ కుమార్, అర్యాన్ సింగ్, యుగంధర్ సింగ్ అనే ప్రధాన నిందితులతో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. వీరంతా సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లు తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారని వెల్లడించారు. ఆ నగదును 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Fraud calls: తస్మాత్ జాగ్రత్త.. అలా చేస్తే అస్సలు స్పందించకండి: ఏసీబీ డీజీ
Hyderabad: బాబోయ్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన