Share News

CM Revanth Reddy: కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన సీఎం రేవంత్

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:51 PM

CM Revanth Reddy: అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకటేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన సీఎం రేవంత్
CM Revanth Reddy

ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గ్యారెంటీ పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, షబ్బీర్ అలీ, సంపత్, ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. అవినీతిని అడ్డుకుంటే చాలు ఆ నిధులు పేదలకు పంచవచ్చని చెప్పారు. తెలంగాణలో అదే చేశామని అన్నారు.కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. పెట్టబడుల కోసం దావొస్ వెళ్తున్నాం, వచ్చాక ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెబుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


కేజ్రీవాల్ లిక్కర్ పార్టనర్ బీఆర్ఎస్‌ను తెలంగాణలో ఓడించామని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. తెలంగాణలో విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తెలంగాణలో 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణలో మహిళల కోసం ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని సీఎం రేవంత్‌ తెలిపారు. ఢిల్లీ ప్రజలకు రెండు గ్యారంటీ హామీలు ఇస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని హామీ ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని ఉద్ఘాటించారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడాలని అన్నారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని విమర్శించారు. అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకటేనని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారని, ఇద్దరూ వేర్వేరు కాదు. ఒక్కటేనని విమర్శించారు. ఢిల్లీని బాగుచేయాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వాతావరణ కాలుష్యమే కాదు, రాజకీయ కాలుష్యాన్ని కూడా ఈ ఇద్దరూ కలిసి పెంచారని మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Formula E Case: ఈడీ విచారణకు కేటీఆర్

Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..

Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 02:00 PM