Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం ప్రకటన
ABN , Publish Date - Feb 04 , 2025 | 02:42 PM
Telangana Assembly: కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో చర్చ మొదలైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Telangana Assembly Session) ప్రారంభమైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ మొదలైంది. సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు ఉభయసభల ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కులసర్వే నివేదిక సమగ్ర ఇంటింటి కులసర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు.
బీసీ లెక్కలు తేల్చి వారికి అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో హామీ ఇచ్చారని.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కుల గణన చేపట్టామన్నారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళామని తెలిపారు. కర్నాటక, బిహార్ సహా వివిధ సర్వేలను అధ్యయనం చేశామని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించామన్నారు. సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని.. 75 అంశాల ప్రాతిపదికగా సర్వేను నిర్వహించామని చెప్పారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే నిర్వహణ జరిగిందని తెలిపారు. తెలంగాణలో 1.12 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందని వెల్లడించారు. పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరుగగా.. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందన్నారు. కులసర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని సీఎం తెలిపారు.
పకడ్బంధీగా సర్వే...
పకడ్బంధీగా కులగణన నిర్వహించామని.. ఇందు కోసం రూ.161 కోట్లు ఖర్చు చేసి సర్వే చేశామన్నారు. ఇది ఒక మోడల్ డాక్యుమెంట్‌గా పనిచేస్తుందని తెలిపారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టామన్నారు . విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించడానికి సర్వే పని చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు అభినందించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని తెలిపారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామని 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారని చెప్పారు. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
సర్వే లెక్కల ప్రకారం..
తెలంగాణలో ఎస్సీలు 17.43 శాతం
సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 మంది
బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) 46.25 శాతం
బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) 1,64,09,179 మంది
ఎస్టీలు 37,05,929 మంది 10.45 శాతం.
ముస్లిం మైనార్టీలు 44,57,012 మంది 12.55 శాతం.
ముస్లిం మైనార్టీల్లో బీసీలు 35,76,588 మంది 10.08 శాతం.
ముస్లిం మైనార్టీల్లో బీసీలు 8,80,424 మంది 2.48 శాతం.
ఓసీలు 56,01,539, మంది 15.79 శాతం.
ముస్లిం మైనార్టీలు మినహా ఓసీలు 47,21,115 మంది 13.31 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీలు 8,80,242 మంది 2.48 శాతం ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News