అరకొర వసతుల మధ్య వైద్యం
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:04 AM
గ్రామస్థాయిలో పేద ప్రజల అనారోగ్య సమస్యలను, తీర్చిదిద్దేందుకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు (పల్లె దవాఖాన, ఆయుష్మాన భారత హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్) లకు సొంత గూడు కరువైంది.

అద్దె భవనాల్లో పీహెచసీలు
గుంతల దశలో నిలిచిన పనులు
మోటకొండూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో పేద ప్రజల అనారోగ్య సమస్యలను, తీర్చిదిద్దేందుకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు (పల్లె దవాఖాన, ఆయుష్మాన భారత హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్) లకు సొంత గూడు కరువైంది. అద్దె భవనాల్లో చాలీ చాలని వసతుల నడుమ ఉప కేంద్రాలను నడుపుతున్నారు. మండలంలో ఒక సెంటర్‌కు మాత్రమే సొంత భవనం ఉంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో గ్రామీణప్రాంత ప్రజలకు, గర్భిణులకు, బాలింతలకు వైద్య సేవాలు అందని ద్రాక్షల మిగిలి పోతున్నాయి. రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన వసతి లేకపోవడంతో వైద్య సిబ్బందికి కుడా అవస్థలు తప్పడం లేదు. మండలంలో నాలుగు ఉప కేం ద్రాలు ఉన్నాయి. అందులో మూడు పల్లె దవాఖాన, ఆయూష్మాన భారత హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లు, ఒకటి సబ్ సెంటర్ ఉన్నాయి. వీటికి పక్క భవనాలు నిర్మించేందుకు ఏడాది క్రితం టెండర్లను పూర్తిచేసి చాడ, నాంచారిపేట గ్రామాల్లో ఉప కేంద్రాలకు స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శంకుస్థాపనలు సైతం చేశారు. ఒక్కో భవన నిర్మణానికి రూ. 20లక్షలు మంజూరయ్యాయి. కానీ సబ్ సెంటర్ నిర్మాణ పనులు ఏడాది దాటిన గుంతల దశలోనే ఆగిపోయిన పట్టించుకునే నాథుడు కరువయ్యాడని మండల ప్రజలు వాపోతున్నారు. పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ నిధులు లేకపోవడంతోనే పనులను నిలిపివేసినట్లు తెలిపారు.
పేరు నాంచారిపేట విధులు కాటేపల్లిలో
నాంచారిపేట గ్రామంలో ఉండాల్సిన సబ్ సెంటర్ నిర్వహణకు అద్దె గదులు లభించకపోవడంతో కాటేపల్లిలోని గ్రామపంచాయతీ భవనంలోకి తరలించారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. అటు చాడ గ్రామంలోనూ పంచాయతీ భవనంలోనే కొనసాగిస్తున్నారు.
వర్షాకాలంలో ఇబ్బందులు
మండలంలో నాలుగు సబ్ సెంటర్లకు గాను మాటూరులోని సబ్ సెంటర్‌కు మాత్రమే పక్కా భవనం ఉంది. అది కూడా నేడు శిథిలవస్థకు చేరుకుంది. పెచ్చులూడడం, రేకులు పగిలి మీద పడడం.. వంటివి తరచూ జరుగుతుంటాయి. వర్షాకాలంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం తేదు.
పాము, కుక్క కాటుకు మందు ఏదీ?
పాము, కుక్క కరిచిన, అత్యవసర పరిస్థితుల్లో సబ్ సెంటర్‌లో మందులు లేకపోడంతో ప్రైవేట్ ఆసుపత్రు లను అశ్రయించాల్సి వస్తోంది. నూతన సబ్ సెంట ర్లకు భవనాలను నిర్మించి మందులు అం దుబాటులో ఉంచాలి. అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
-పబ్బతి జయంతరెడ్డి, చాడ గ్రామస్థుడు
నూతన సబ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలి
మండలంలో నాలుగు సబ్ సెంటర్లు ఉన్నాయి. అందులో ఒకటి శిథిలావస్థలో ఉండగా మరొకటి ప్రథమిక ఆరోగ్య కేంద్రంలోని అదనపు గదిలో కొనసాగుతోంది. మిగిలిన రెండు సెంటర్ల నిర్మాణం కోసం పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా పనులు ప్రారంభ దశలోనే మిగిలాయి. వాటిని త్వరితగతిన పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకువస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
-విజయ్, మండల వైద్యాధికారి, మోటకొండూరు