Share News

‘డబుల్‌ బెడ్‌’ ఇళ్లు నిరుపయోగమేనా?

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:25 AM

పేదల సొంతింటి కల నెరవేరుస్తామంటూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం ఆశావాహుల కళ్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

‘డబుల్‌ బెడ్‌’ ఇళ్లు నిరుపయోగమేనా?

నిలిచిన కట్టడంలో పశువులకు ఆవాసం

భువనగిరి టౌన, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల నెరవేరుస్తామంటూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం ఆశావాహుల కళ్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒకవైపు పూర్తయిన ఇండ్లు నిరుపయోగంగా ఉండగా మరోవైపు అర్థాంతరంగా నిల్చిన మరిన్ని ఇళ్ల సముదాయం పశువుల షెడ్డులా మారింది. ఈ భిన్నమైన పరిస్థితి జిల్లా కేంద్రం భువనగిరిలో నెలకొంది. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన కొత్తలో స్థానిక సింగన్నగూడెంలో నిర్మించిన 444 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కనీసం, తాగునీరు, విద్యుత, డ్రైనేజీ తదితర ఎలాం టి మౌలికవసతులు కల్పించకుండానే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను పంపిణీ చేశారు. మౌలిక సదుపాయాల కోసం రూ.4.50 కోట్లతో ప్రతిపాదించారు కూడా. అనంతరం కొలుదీరిన కాంగ్రెస్‌ ప్రభు త్వం కూడా ఆ ప్రతిపాదనలను సవరిస్తూ త్వరలోనే పనులు పూర్తిచేసి నివాసయోగ్యంగా తీర్చిదిద్ది అప్పగిస్తామని లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తించారు. కానీ నేటికీ సొంతింటి కల నెరవేరని పరిస్థితి ఆ లబ్దిదారులది. ఇదిలా ఉంటే మరింత మందికి సొంతింటిని అందిస్తామని స్థానిక హుస్సేనబాద్‌ ఇందరిమ్మ కాలనీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిపాదించి ప్రారంభించిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయం పనులు పలు కారణాలతో అర్ధాంతరంగా నిలిచాయి. ఫలితంగా ఆ మూడంతస్తుల డబుల్‌బెడ్‌ ఇళ్ల సముదాయం కాస్తా నేడు పశువుల పాకగా రూపాంతరం చెందింది. దీంతో ప్రతిపాదిత పనులను సకాలంలో పూర్తిచేసి, అప్పగిస్తే పేద కుటుంబాలకు నీడనివ్వాల్సిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పశువులకు ఆవాసాలుగా మారాయని డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల్లు నిరుపయోగంగా ఉండటానికి ప్రభుత్వం, అధికారులు చూపుతున్న అలసత్వమే కారణమని పలువురు అంటున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 01:25 AM