స్థిరంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:20 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం స్థిరంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 202 4-25 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.7కోట్లు మాత్రమే సమకూరాయి.

గత ఏడాది కంటే స్వల్పంగా పెంపుదల
తగ్గిన డాక్యుమెంట్లు, కలిసి వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్
మందకొడిగా రియల్ వ్యాపారం
ఈ ఆర్థిక సంవత్సరంలో పుంజుకునే అవకాశం
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం స్థిరంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 202 4-25 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.7కోట్లు మాత్రమే సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.41 2,37,19,250 ఆదాయం రాగా, 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నాటికి రూ.419,49,18,168 సమకూరాయి. ప్రభు త్వ ఖజానాకు ఆదాయం పెరగపోయినా, గతంతో పోలిస్తే ఆదాయం మాత్రం నిలకడగా ఉంది.
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ల్లో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,43,426 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నాటికి 1,38,729 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తక్కువగా జరిగినా ఆదాయం మాత్రం పెరిగిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,697 డాక్యుమెంట్లు త క్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. అత్యధికంగా నల్లగొండ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, దేవరకొండ ప్రాంతాల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తరువాతి స్థానాల్లో చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, కోదాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.
మందకొడిగానే క్రయవిక్రయాలు..
ఉమ్మడి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల క్రయవిక్రయాలు మందకొడిగానే సాగాయి. హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రభావం చూపింది. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న వెంచర్లపై ఆస్తుల కొనుగోలుదారుల్లో నమ్మకం సన్నగిల్లడంతో ప్లాట్ల కొనుగోలు కొంత మేర తగ్గింది. వెంచర్లకు అన్ని అనుమతులు ఉన్నాయా? చెరువు శిఖంలోనిదా? ప్రభుత్వ భూమినా? అసైన్డ్‌ల్యాండ్‌లో వెంచర్లు చేశారా? అని ప్రజలు ఆలోచించడంతోపాటు, ఆరా తీయడం పెరిగింది. ప్లాట్ల కొనుగోలుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇంటి స్థలాలు, అపార్ట్‌మెంట్ల ధరలు పెరగడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపింది. ప్రభుత్వం మార్కెట్ వ్యాల్యూను కూడా పెంచింది. దీంతో స్టాంప్ డ్యూటీ పెరగడంతో ఆస్తుల కొనుగోలుదారులు అటూ కొనుగోళ్లకు ఇటూ రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి కొనుగోళ్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. లేఅవుట్‌లు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అక్రమ లేఅవుట్లా? సక్రమమా? అని అధికారులు ఎప్పడికప్పుడు తేల్చిచెబితే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. కానీ, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రజలకు నమ్మకం కలగడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఈ ఏడాది రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది.
కలిసొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్
రియల్ ఎస్టేట్ వ్యాపారం రెండు మూడు నెలల క్రితం వరకు పెద్దగా లేకపోవడం ఆస్తుల క్రయవిక్రయాలపై ప్రభావం చూపింది. కరువు ప్రభావంతో ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. అయితే ప్రభుత్వం ఆ తరువాత 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడంతో చాలా మంది దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరో నెల రోజుల పాటు రాయితీతో ఈ అవకాశం కల్పించడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగనుంది. ఎల్‌ఆర్‌ఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు, కొనుగోలుదారులకు, విక్రయదారులకు అవగాహన అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు మరో నెల గడువు పొడిగించినందున రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కారణంగా స్టాంప్ డ్యూటీతో సంబంధిత శాఖకు కొంతలో కొంత ఆదాయం కలిసి వచ్చింది. ఇంకా ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజలు ముందుకు రావాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. మొత్తానికి స్టాంపులు రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం గణనీయంగా పడిపోకుండా ప్రణాళికా ప్రకారం ముందుకు సాగడంతో స్వలంగా రాబడి పెరిగింది. తాజాగా, చౌటుప్పల్, భువనగిరిలో స్లాట్ బుకింగ్ నూతన విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నూతన విధానంతో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తికానున్నాయి. ప్రస్తుతం ప్రతీ రోజు 48 స్లాట్లు బుకింగ్ చేసుకునే వీలుంది. ఈ విఽధానం కారణంగా రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరుగుతుంది. మున్ముందు స్లాట్ల బుకింగ్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన విధానం అమలవుతుండగా, త్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ విధానం అమలుకానుంది.
పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు : ఎస్.ప్రకాశ్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా జవాబుదారీతనంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరు కూడా మధ్యవర్తులను ఆశ్రయించకుండా సంబంధిత కార్యాలయాల్లోనే పని చేయించుకోవాలి. భువనగిరి, చౌటుప్పల్ కార్యాలయాల్లో నూతనంగా స్లాట్ బుకింగ్ విధానం చేపట్టాం. ఇది విజయవంతంగా కొనసాగుతోంది. త్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడతాం.
ఉమ్మడి జిల్లాలో 2023-24, 2024-25లో డాక్యుమెంట్లు, ఆదాయం ఇలా..
సబ్ రిజిస్ట్రార్ 2023-24 ఆదాయం 2024-25 ఆదాయం
కార్యాలయం డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు
నల్లగొండ 19,882 63,57,54,063 20,058 64,85,25,523
చౌటుప్పల్ 9,264 54,77,76,162 9,034 58,16,87,668
యాదగిరిగుట్ట 21,939 46,86,76,323 16,909 45,52,99,354
భువనగిరి 10,462 46,64,18,934 9,075 45,23,67,658
సూర్యాపేట 17,464 44,01,20,454 18,707 41,20,98,250
కోదాడ 10,078 33,26,01,454 9,176 38,02,99,097
బీబీనగర్ 9,804 31,84,90,916 9,181 29,73,11,343
మిర్యాలగూడ 8,965 29,06,52,200 9,464 29,45,54,859
దేవరకొండ 9,773 14,62,18,991 10,686 17,32,61,406
హుజూర్‌నగర్ 6,088 12,66,90,065 6,007 15,06,99,098
నకిరేకల్ 4,715 9,05,49,313 4,862 9,25,04,719
నిడమనూర్ 5,445 8,45,87,410 5,718 8,53,26,522
మోత్కూర్ 2,893 6,86,19,031 3,383 6,24,95,872
రామన్నపేట 3,551 5,94,35,316 3,333 5,59,04,434
చండూరు 3,097 4,70,67,949 3,128 5,25,33,195
మొత్తం 1,43,426 4,12,37,19,251 1,38,729 4,19,49,18,168