Share News

కొరవడిన తులసీ కాటేజీ భద్రత

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:52 AM

అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రానికి భద్రత విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.1200 కోట్లతో నిర్మించిన ఆలయానికి భద్రత కొరవడినట్లు కన్పిస్తోంది.

కొరవడిన తులసీ కాటేజీ భద్రత

సీసీ కెమెరాలు..ప్రహరీలేని అద్దె గదులు

వీటిలో గ్రీజర్లు.. ఫిర్యాదుల పుస్తకం లేని వైనం

కనీసం డార్మెంటరీ హాల్‌లేని దైన్యం

సదుపాయాల కల్పనలో ఇన్నేళ్లుగా అధికారుల నిర్లక్ష్యం

యాదగిరిగుట్ట, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రానికి భద్రత విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.1200 కోట్లతో నిర్మించిన ఆలయానికి భద్రత కొరవడినట్లు కన్పిస్తోంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తుల నుంచి పలు రకాల ఆదాయ మార్గాలను ఆన్వేషించి టికెట్టు రూపంలో ముక్కుపిండే అధికారులు వారికి కావాల్సిన రక్షణ, భద్రత, మౌళిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. భక్తుల అద్దె గదులు గల తులసీ కాటేజీ ఏకైక అవకాశంగా ఉన్నా, అవగాహన లోపమో, విధుల్లో నిర్లక్ష్యమో గానీ...ఇక్కడ భద్రత, వసతులు కల్పించేందుకు ఆలయ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత కొండపైన సుమారు 100 మంది నిద్రించేందుకు డార్మెటరీ హాల్‌ మాత్రమే ఉంది. ఎంతో ప్రాధాన్యంగల కాటేజీలో ఏఈవో, పర్యవేక్షకుడు, గుమస్తా స్థాయి అధికారులు ఇన్నేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తూ అవగాహన లోపంతో భద్రత, మౌళిక వసతుల కల్పనకు కనీసం ప్రతిపాదనలు చేయకపోవడం వీరి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దేవస్థానికి సంబంధించి భక్తులకు కావాల్సిన అద్దె గదులు తులసీ కాటేజీలో మాత్రమే లభిస్తాయి. యాదగిరిగుట్ట పాత బస్టాండ్‌లో దిగిన భక్తులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇక్కడకు వెళ్లాలంటే భక్తులు ప్రైవేట్‌ వాహనాలకు ఆశ్రయించక తప్పడం లేదు. వ్యక్తిగత వాహనాల్లో ఇక్కడకు చేరుకునేందుకు కనీసం తులసీ కాటేజీని సూచించే సైన బోర్డులు ఎక్కడ ఏర్పాటు చేయలేదు. భద్రత సిబ్బంది కనిపించకపోవడంతోపాటు కనీసం నిఘా నేత్రాలను కూడా (సీసీ కెమారాలు) ఇక్కడి దరిదాపుల్లో బిగించలేదు. కాగా, కాటేజీలో నృరసింహ సదనంలో 76గదులు, లక్ష్మీ సదనం 94గదులు, ఆండాల్‌ సదనం 242 గదులతోపాటు రూ.1,500 నుంచి రూ.3వేల వరకు అద్దె ప్రాతిపదికన సుమారు 62 కాటేజీలు కూడా ఉన్నాయి. గత నాలుగేళ్లుగా మొత్తం 412 అద్దె గదులు, 62 అతిథి గృహాల ద్వారా రూ. 9,5278,363 ఆదాయం సమకూరింది. ఇన్నేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోన్న అద్దె గదులపై ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఎంతో మంది అధికారులు మారినప్పటికీ ఎవరు పట్టించుకోక నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆలస్యంగా విధులకు రావడం ముందుగానే ఇంటి బాట పట్టడం నిత్యకృత్యంగా మారింది. పట్టించుకునే నాథుడు లేక విధుల్లో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ.. అద్దె గదులపై అధికారుల చిత్తశుద్ధి లోపించింది.

ప్రహరీ లేదు

తులసీ కాటేజీ ప్రాంతం ఒకే వలయంలోకి తెచ్చేందుకు వీటి చు ట్టూ ఇప్పటివరకు ప్రహరి నిర్మించలేదు. ఈ గదులు యాదగిరిక్షేత్రం అభిముఖంగా ఉన్న పెద్దగుట్టకు మధ్యలో ఉన్నాయి. గదుల వెనకాల అటవి ప్రాంతంతో పెద్దగుట్ట ఉండగా ఇది దాటితే పూర్వగిరి ఆల యం దర్శించుకునే వీలుంటుంది. ఈ రెండు గుట్టల మధ్య ఉన్న గదుల్లో అద్దెకు దిగిన భక్తులకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో భక్తు లు అభద్రత భావానికి లోనవుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే అధికారులు వీటి చుట్టూ ప్రహరీ నిర్మించక ప్రైవేట్‌ సత్రాలకు వెళ్లేందుకు దారి వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ భవనాల చుట్టూ తాగి పడేసిన బీరు సీసాలు కన్పిస్తున్నాయి. ఇక్కడ సాధ్యమైనంత త్వరగా ప్రహరీ నిర్మించి భక్తులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

భద్రతా సిబ్బంది లేరు

24/7 నిత్యం భక్తులతో కిటకిటలాడే తులసీ కాటేజీలో భద్రతే లేదు. 43 మంది ఎస్పీఎఫ్‌, 23 మంది హోంగార్డులు, వీరికి తోడు అదనంగా మరో 34 మంది సురక్ష సిబ్బందితో కలిపి 100 మందితో కొండపైనే విధులు నిర్వహిస్తుండగా, వీరిలో ఒక్కరిని కూడా తులసీ కాటేజీలో ఇప్పటి వరకు నియమించకపోవడం అధికారుల చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. అధిక రద్దీతో ఇక్కడ కొన్నిసార్లు గొడవలు జరిగి సిబ్బందిపై దాడులు కూడా జరుగుతుంటాయి. వాటిని అదుపు చేసేందుకు ఆలయ వర్గాలు నేటికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. భద్రత సిబ్బందితోపాటు సీసీ కెమెరాలు అందుబాటులోకి తేవడమే కాక ప్రహరీ లేనందున నిత్యం ఇక్కడ తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడకు ఎవరెవరు వచ్చేది.., పోయేదీ ఎంతకి అంతు చిక్కని ప్రశ్నే. ఇన్ని గదుల్లో కనీసం గ్రీజర్లు అందుబాటులోకి తేకపోవడం అధికారుల పని తీరును ప్రశ్నిస్తోంది. భక్తుడి ఇబ్బందులు, వసతులపై ఫిర్యాదులు చేసేందుకు ఓ పుస్తకం లేకపోవడం ఒక ఎత్తయితే అధికారుల ఫోన నంబర్లు కూడా ప్రదర్శించకపోవడం మరో ఎత్తు.

డార్మెంటరీ హాల్‌ నిర్మించాలి

ఇప్పటి వరకు అద్దె గదుల కోసం వచ్చిన భక్తులు నిరీక్షించేందుకు సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతోపాటు విశ్రాంతి గది కూడా అందుబాటులో లేదు. ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఇక్కడ గదులు దొరకని భక్తులకు బోట్‌ షీకారు కోసం కేటాయించిన స్థలంలో డార్మెంటరీ హాల్‌ నిర్మాణం చేస్తే ఎంతో మేలు జరుగుతోంది. బోట్‌ షీకారు కోసం కేటాయించిన స్థలం ఆ పక్కనే సత్యదేవుని వ్రతాలు జరిపిన స్థలంలో తాత్కాలిక, శాశ్వతంగా డార్మెంటరీ హాల్‌ నిర్మించొచ్చు. కొండపైన నిద్రించేందుకు అవకాశం లేనందున పూర్తి రక్షణ చర్యలతో విద్యుత దీపాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఏర్పరచి భారీ షెడ్డును నిర్మించేందుకు అనువైన స్థలం ఉంది. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే కనీసం దేవస్థానం పరిధిలో నిద్రించామనే తృప్తి భక్తులకు మిగులుతోంది.

అదనంగా సిబ్బందిని నియమించాలి

తులసీ కాటేజీ వద్ద భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంది. తులసీ కాటేజీ వద్ద అధిక రద్దీ ఉంటున్నందున భద్రత కల్పిస్తాం. ప్రస్తుతం కొండపైన 100 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరితోనే కొండపైన భద్రత ఏర్పాట్లకు సరిపోతున్నారు. తులసీ కాటేజీలో భద్రత చర్యలు చేపట్టేందుకు కొత్తగా అదనపు సిబ్బంది నియమించాల్సి ఉంది.

-కే.శేషగిరిరావు, ఎస్పీఎఫ్‌ ఇన్సపెక్టర్‌, యాదగిరిగుట్ట దేవస్థానం

త్వరలో భద్రత సిబ్బందిని నియమిస్తాం

తులసీ కాటేజీలో భద్రతకోసం త్వరలో హోంగార్డు సిబ్బందిని నియమిస్తాం. అప్పటివరకు రాత్రి ఇద్దరు హోంగార్డులను కేటాయిస్తాం. భవనాల రక్షణకు చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేస్తాం. దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. అప్పటివరకు భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశాం. త్రాగునీటీ వసతి, గదులు, భవన పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని ఎప్పటికప్పుడు పురామాయిస్తున్నాం. త్వరలో ఫిర్యాదుల పుస్తకం ఏర్పాటు చేస్తాం.

-ఈవో ఏపూరి భాస్కర్‌రావు (యాదగిరిగుట్ట, దేవస్థానం)

Updated Date - Apr 02 , 2025 | 12:52 AM