మండుటెండలో మహావర్షం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:59 PM
యాదాద్రిభువనగిరి జిల్లాను గురువారం ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కుదిపేశాయి. ఉదయం వరకు ఉక్కపోతు, వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది.

యాదాద్రిభువనగిరి జిల్లాను గురువారం ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కుదిపేశాయి. ఉదయం వరకు ఉక్కపోతు, వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. సంస్థాననారా యణపురం, తుర్కపల్లి మండలాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు జీవాలు మృత్యువాత పడగా, వడగండ్ల కు కంకులు నేలకొరిగి ధాన్యం రాలిపోయింది.
తుర్కపల్లి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తుర్కపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం మండలకేంద్రంతో పాటు పలుగ్రామాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో వరి, మామిడి తోటలు దెబ్బతిన రైతులకు భారీ నష్టం వాటిల్లింది. తుర్కపల్లిలోని భువనగిరి-గజ్వేల్ రహదారికి ఇరువైపులా ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. చెట్లు కూలి కార్లు, వాహనాల మీద పడడంతో దెబ్బతిన్నాయి. భువనగిరి-గజ్వేల్ రహదారిలో వాసాలమర్రి సమీపంలో భారీ ఈదురుగాలులతో వేపచెట్టు కూలీ అడ్డంగా పడటంతో అరగంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచాయి. ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడ్డారు. చేతికందిన వరి పంట నేలకు ఒరగడంతో పాటు వడగండ్లకు కంకులు రాలిపోయాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోవడంతో యాజమానులకు భారీగా నష్టం వాటిల్లింది. వాసాలమర్రిలో చెన్నబోయిన ఆంజనేయులు ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో సామగ్రి తడిసి ముద్దయ్యింది.
రాజపేట: రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. నర్సాపూర్‌లో 10నిమిషాల పాటు కచ్చకాయల సైజులో వడగండ్లు పడ్డాయి. 20 రోజుల్లో చేతికి వచ్చే కంకి దశలో ఉన్న వరి పంట దెబ్బతింది. కొంతమేర రాలిపోయింది. అధికారులు పంటనష్టం అంచనా వేసి ఆర్థికసహాయాన్ని అందించాలని రైతులు అంజిరెడ్డి, ఉప్పలయ్య, గోపాల్‌రెడ్డి తదితరులు కోరారు.
రామన్నపేట: మండలంలో వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి చేనుల్లో ధాన్యం రాలిపోయింది. పలుచోట్ల మామిడి తోటల్లో కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు నీళ్లు అందక కొంత పంట ఎండిపోగా, ప్రస్తుతం వర్షానికి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భూదానపోచంపల్లి: భూదానపోచంపల్లిలో సాయం త్రం భారీవర్షం కురిసిన వర్షానికి పలుచోట్ల రహదా రులపై నీరునిలిచింది.మూసీ పసరివాహక ప్రాంతం కావడంతో అన్నిగ్రామాల్లో ధాన్యం కోతలకు చేరువైంది. చేతికందే సమయాన అకాల వర్షాలతో పంట దెబ్బతిని అన్నదాతలకు తీవ్రనష్టం వాటిల్లింది.
వలిగొండ : వలిగొండ మండలంలో గురువారం సాయంత్రం ముసురు కురిసింది. ఉదయం ఉక్కపోతగా ఉండి సాయంత్రానికి ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో చిరుజల్లులు కురిసింది. ఈదురుగాలులతో విద్యుతకి అంతరాయం కలిగింది.
చౌటుప్పల్ టౌన: చౌటుప్పల్ పట్టణంలో గురువారం సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి ఉక్కపోగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వరి పొలాలకు ఈ వర్షం కొంత జీవం పోసిందని రైతులు తెలిపారు.
మోత్కూరు/ ఆత్మకూరు(ఎం): మోత్కూరు మండలంలో గురువారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. రేవతి కార్తె కావడంతో వడగళ్లు కురుస్తాయేమోనని రైతులు ఆందోళన చెందారు. తేలిక పాటి వర్షం కురియడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం రాశులపై రైతులు టార్పాలిన్లు కప్పి ధాన్యం తడువకుండా కాపాడుకున్నారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది.
భువనగిరి టౌన : భువనగిరిలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలకు వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. సాయంత్రానికి నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తేలికపాటి జల్లులు కురిశాయి. రాకపోకలు, చిరు వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.
రెండు గంటల్లో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం
సంస్థాన నారాయణపురం : సంస్థాననారాయణపురం మండలంలో రెండు గంటల్లో 9.78 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. సాయంత్ర నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇన్నాళ్లు వర్షాల్లే భూగర్భజలాలు అడుగంటి అటు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారీ వర్షం అటు రైతుల్లో, ప్రజల్లో ఆనందం నింపింది. శేరిగూడెం గ్రామంలో కుంటకట్టలోకి, నారాయణపురంలోని మేళ్లచెరువు కుంటలోకి వరద చేరుతోంది. ఇన్నాళ్లు నీళ్లులేక ఎండిన చెరువులు, కుంటలు నీటికళ సంతరించుకున్నాయి. అకాల వర్షానికి నారాయణపురంలో చెట్లు విరిగిపడ్డాయి. మండలకేంద్రానికి చెందిన జక్కడి వెంకట్‌రెడ్డికి చెందిన ఎకరం టమాట తోట వర్షానికి దెబ్బతింది. గడ్డం నరసింహకు చెందిన ఇల్లు దెబ్బతింది. కొంతమేర వరి పంటకు నష్టం వాటిల్లింది.
నాలుగున్నర గంటల్లో 8.25 సెంటీమీటర్ల వర్షపాతం
తుర్కపల్లి: మండలంలో గురువారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి వడగండ్ల వర్షం మొదలైంది. 50నిమిషాల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షం కురువగా సాయంత్రం వరకు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. సాయంత్రం 7 గంటల వరకు 8.25 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఏడు గంటల తర్వాత విద్యుత పునరుద్ధరణ
మండలకేంద్రంతో పాటు దత్తాయపల్లి, ఎంజీబండ, డీబీతండా, కోనాపురం, ముల్కలపల్లి, తదితర గ్రామాల్లో 20 విద్యుతస్తంభాలు కూలి సరఫరా నిలిచింది. మధ్యాహ్నం 2.30 గంటలకు సరఫరాకు ఆటంకం కలగగా జిల్లా ఎస్‌ఈ సుధీర్‌కుమార్ పర్యవేక్షణలో కమర్షియల్ ఏడీ రవీందర్‌నాయక్, ట్రాన్సకో ఏఈ భిక్షపతిగౌడ్‌ల ఆధ్వర్యంలో విద్యుతసరఫరా పునరుద్ధరణ పనులు చేప ట్టారు. కూలిపోయిన విద్యుత స్తంభాల స్థానంలో కొత్తస్తంభాలను, విద్యుతవైర్లను ఏర్పాటుచేయించారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు విద్యుత సరఫరాను అన్నిగ్రామాల్లో పునరుద్ధరించారు. ఇందుకోసం అన్నిస్థాయిల్లోని విద్యుత అధికా రుల బృందం ఏడున్నర గంటలు శ్రమించింది.
పిడుగుపాటుకు జీవాలు మృతి
రాజాపేట: భారీవర్షాలకు తోడు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పాముకుంట, బేగంపేట గ్రామాల్లో పిడుగుపడి షేక్ మౌలానాకు చెందిన పాడిగేదె, గడ్డమీది ఉప్పలయ్యకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. సుమారు రూ.2.50లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
సింగారం గ్రామంలో విద్యుదాఘాతంతో మూడు మేకలు మృతి చెందాయి. రూ.40 వేల నష్టం వాటిల్లింది. షేక్ షాద్‌ల్లా, కృష్ణ, మహ్మద్‌లకు చెందిన మూడు మేకలు సెల్ టవర్ వద్ద మేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మేకలు మృతి చెందాయి.
15 రోజుల కిందటే కొనుగోలు
వలిగొండ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): వలిగొండ మండలంలో గురువారం సాయంత్రం పిడుగుపడి గేదె మృతి చెందింది. టేకులసోమారం గ్రామానికి చెందిన రైతు పాక రాంచందర్ తన పొలం వద్ద పాడిగేదెను కొట్టంలో కట్టేశాడు. పిడుగుపాటుకు గురై గేదె మృతి చెందింది. గేదెను 15రోజుల క్రితమే రైతు కొనుగోలు చేశాడు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.