పాల బిల్లుల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:05 AM
మదర్‌డెయిరీలో నెలకొన్న అప్పులతో పాడి రైతులకు బిల్లుల చెల్లింపు కష్టతరంగా మారింది. నెలల తరబడి పాల బిల్లులకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పశు పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.

నెలలతరబడి వేచి చూస్తున్న పాడి రైతులు
సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పశుపోషణకు ఇబ్బందులు
మదర్ డెయిరీ అప్పులతో రైతులకు కష్టతరంగా మారిన వైనం
ప్రభుత్వ గ్రాంటా? స్థిరాస్తుల విక్రయమా..?
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మదర్‌డెయిరీలో నెలకొన్న అప్పులతో పాడి రైతులకు బిల్లుల చెల్లింపు కష్టతరంగా మారింది. నెలల తరబడి పాల బిల్లులకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పశు పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.
పాడి రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన నల్లగొండ-రంగారెడ్డిజిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం(మదర్‌డెయి రీ) అప్పుల ఊబిలో చిక్కుకుంది. మదర్‌డెయిరీకి ప్రస్తుతం రూ.35కోట్లకు పైగా వివిధ బ్యాంకుల్లో అప్పులున్నాయి. నెలకు రూ.45లక్షల మేరకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు సకాలంలో సంస్థ బిల్లులు చెల్లించలేకపోతుంది. మదర్ డెయిరీ భవిష్యత్‌తోపాటు సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రైతుల్లో చర్చ మొదలైంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధి లో నార్మూల్ పరిధిలో మొత్తం 290 పాల సంఘాలున్నాయి. పాలసంఘాల ద్వారా నిత్యం దాదాపు 60వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. పాడి రైతులకు నెలావారీగా బిల్లులు చెల్లించాలని పాల సంఘాల చైర్మన్లు పాలకవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం పాలకవర్గం ఆధ్వర్యంలో మదర్‌డెయిరీ ని లాభాల బాట పట్టించి, రైతులకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మదర్‌డెయిరీకి ప్రత్యేకంగా గ్రాంట్‌ను మంజూరు చేయించేందుకు పాలకవర్గం కసరత్తు చేస్తుంది. మరోవైపు సంస్థ పరిధిలోని భూములను వేలం వేసి రైతులకు చెల్లించాల్సిన బిల్లులతోపాటు...పలు బ్యాంకుల్లో ఉన్న అప్పులు తీర్చాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్తుల విక్రయం ఆలస్యమవుతున్నందున, ప్రభుత్వం నుంచి తక్షణం సహాయం కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమస్యలు విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మదర్ డెయిరీ అప్పులను తీర్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రస్తుతం పాలకవర్గం ప్రత్యేక గ్రాంట్ మంజూరుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే కోఆపరేటివ్ చట్టం ప్రకారం మదర్ డెయిరీకి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం సాధ్యమవుతుందా? అన్న అంశం పరిశీలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు స్థిరాస్థుల విక్రయానికే పాలకవర్గం మొగ్గుచూపుతోంది. ఈమేరకు పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేసింది. డెయిరీ ఆస్తులను బ్యాంకులు జప్తు చేసిన పక్షంలో తక్కువ ధరకు ఆస్తుల విక్రయాలు జరుగుతాయని, మదర్ డెయిరీ పాలకవర్గం ఆధ్వర్యంలో బహిరంగ మార్కెట్‌లో వేలం వేసిన పక్షంలో అధిక ధర వచ్చే అవకాశం ఉందని యోచిస్తోంది. 10మందితో నియమించిన కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల, మిర్యాలగూడ, తదితర ఆస్తులు అమ్మడం ద్వారా సంస్థకు రూ.55కోట్ల మేరకు వచ్చే అవకాశం ఉందని ఆశాభావంతో ఉన్నారు. వివిధ బ్యాంకుల్లో మదర్‌డెయిరీకి చెందిన అప్పులు తీర్చడంతోపాటు రైతులకు సకాలంలో పాల బిల్లులు చెల్లించవచ్చని పాలకవర్గం భావిస్తుంది.
అప్పులపై సవాళ్లు... ప్రతిసవాళ్లు
మరోవైపు మదర్‌డెయిరీలోని అప్పులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. గత పాలకుల వల్లే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిందని ప్రస్తుత పాలకవర్గం ప్రకటిస్తుండగా... రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, లీటరు పాలకు రూ.4 బోనస్ ఇచ్చి ఆదుకుందని గత పాలకులు ప్రతిస్పందిస్తున్నారు. మదర్ డెయిరీ స్థిరాస్తులు విక్రయిస్తే కానీ బయటపడలేమని ఇటీవల జరిగిన మదర్‌డెయిరీ సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత పాలకవర్గం ప్రకటించింది.
2014-15 తర్వాత నష్టాలు
2014-15వరకు లాభాల్లో నడిచిన డెయిరీకి ఆ తర్వాత అన్ని నష్టాలేనని, చిట్యాల, నకిరేకల్, చండూరు, తదితర ప్రాంతాల్లోని మదర్ డెయిరీకి చెందిన భూములపై గత పాలకులు పెద్ద ఎత్తున అప్పులు తేవడంతో తీవ్రంగా నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. డెయిరీ నష్టాల్లో కూరుకుపోవడానికి పాలకవర్గమే బాధ్యత వహించాలని, డిస్ర్టిబ్యూటర్‌కు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోరాదని... నష్టానికి కారణాలు తెలుసుకుని స్థిరాస్థులు విక్రయించకుండా తగిన చర్యలు చేపట్టాలని పాలకవర్గంలోని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
నెలవారీ బిల్లులు చెల్లించాలి
అయితే పాడి రైతులు మాత్రం సంస్థ అప్పులు ఎలా ఉన్నా... రైతులకు చేయూతనిచ్చేందుకు ఏర్పడిన మదర్‌డెయిరీలో పాలు పోస్తున్న వారికి నెలవారీగా బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చర్చించి రైతులకు న్యాయం చేయాలని పలు గ్రామాల్లోని పాల సంఘాల చైర్మన్లు కోరుతున్నారు.