Share News

NIMS: నిమ్స్‌లో ఓపీ స్లిప్‌లకు చెల్లు చీటీ!

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:17 AM

నిమ్స్‌లో ఓపీ స్లిప్‌ల కోసం గంటల తరబడి నిరీక్షించే పరిస్థితికి త్వరలోనే చెక్‌ పడనుంది. ఇందుకోసం నిమ్స్‌ మిలీనియం బ్లాక్‌ వద్ద ప్రయోగత్మకంగా ఒక కియోస్క్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.

NIMS: నిమ్స్‌లో ఓపీ స్లిప్‌లకు చెల్లు చీటీ!

  • కొత్తగా కియోస్క్‌ యంత్రాల ఏర్పాటు

  • ప్రయోగాత్మకంగా మిలీనియం బ్లాక్‌ వద్ద 4 విభాగాల రోగులకు అందుబాటులోకి..

  • తొలి దఫాలో ఫాలో అప్‌ కేసులకే

  • దశల వారీగా అన్ని విభాగాల్లో ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో ఓపీ స్లిప్‌ల కోసం గంటల తరబడి నిరీక్షించే పరిస్థితికి త్వరలోనే చెక్‌ పడనుంది. ఇందుకోసం నిమ్స్‌ మిలీనియం బ్లాక్‌ వద్ద ప్రయోగత్మకంగా ఒక కియోస్క్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. తొలుత రెండో సారి వైద్యుల వద్దకు రివ్యూ, ఫాలోఅప్‌ కోసం వచ్చే రోగులకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. త్వరలోనే రెండో యంత్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ రెండు యంత్రాల పని తీరు, ఫలితాలను బట్టి మిగతా విభాగాలకు వీటిని విస్తరించనున్నారు. రెండో సారి వైద్యుల వద్దకు వచ్చే రోగులు.. నేరుగా ఈ యంత్రం వద్దకు వెళ్లి రోగి పేరు, వైద్యుడి పేరు, వివరాలు పొందుపరిస్తే స్లిప్‌ వస్తుందని, ఇదంతా పూర్తి కావడానికి 30 సెకన్లు మాత్రమే పడుతుందని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు.


తొలుత న్యూరాలజీ, న్యూరో సర్జరీ, రుమాటాలజీ, సైక్రియాట్రిక్‌ విభాగాల రోగులు దీనిని వినియోగించునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మొదటి సారి నిమ్స్‌కు వచ్చే రోగులు మాత్రం యథావిధిగా ఓపీ కౌంటర్‌ వద్ద స్లిప్‌లు పొందాల్సి ఉంటుందని, రెండో సారి ఫాలో అప్‌, రివ్యూ కోసం లేదా వ్యాధి నిర్ధారణ నివేదికలను వైద్యులకు చూపించడానికి వచ్చే వారు మాత్రం కియోస్క్‌ యంత్రాల ద్వారా సేవలు పొందవచ్చుని అడిషనల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చరణ్‌ రాజ్‌ వివరించారు. రెండో సారి కూడా ఓపి కౌంటర్‌ వద్ద రోగులు పడిగాపులు పడకుండా ఉండడానికి ఈ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘‘రెండో సారి ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగులు తిరిగి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ రోగులకు 14 రోజులు, ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌సీ, జీహెచ్‌సీ కేటగిరీ రోగులకు 28 రోజుల వరకు ఈ అవకాశం ఉంటుంది. ఫాలోఅప్‌ కోసం దాదాపు 65 శాతం మంది రోగులు వస్తుంటారు. ఈ యంత్రాలు అందుబాటులోకి వచ్చాక వారు మళ్లీ ఓపీ కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు’’ అని వివరించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 04:17 AM