సన్న బియ్యం ధరలు దిగి వచ్చే
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:01 AM
గత ప్రభుత్వాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.

మార్కెట్లో క్వింటాకు రూ.400 మేర తగ్గిన సన్నబియ్యం ధరలు
మధ్య తరగతి వర్గాల్లో ఆనందం
రేషన్‌దుకాణాలకు క్యూ కడుతున్న ప్రజలు
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న సన్న బియ్యం ధరకు ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాకు రూ.400 నుంచి రూ.600 వరకు తగ్గింది. గత నెలలో ఫైన్ క్వాలిటీ బియ్యం వివిధ బ్రాండ్ల వారీగా క్వింటా ధర రూ.5,800 నుంచి రూ.6,500 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.5వేల లోపే ధర ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నరకం వరి సాగును ప్రోత్సహించి సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కూడా ప్రకటించడంతో అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారు. అనుకున్న మేరకు అధికంగా సన్నధాన్యం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో సన్నబియ్యం ధరలు తగ్గుతుండడంతో మధ్య తరగతి వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
యాదాద్రిజిల్లాలో 2.03లక్షల రేషన్‌కార్డులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 515 రేషన్ షాపులు ఉన్నాయి. సుమారు 2.03లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కార్డులకు ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులు 13,711 మంది ఉన్నారు. వారికి ఒక్కో కార్డుపై ప్రభుత్వం 35కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తోంది. వీటికి ప్రతినెలా 4,304.669 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటాయించి పంపిణీకి చర్యలు చేపట్టింది. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేయడం, వాటిని లబ్ధిదారులు తినకపోవడంతో బయటి మార్కెట్‌లో రీసైక్లింగ్ జరిగేవి. ఇప్పుడు సన్న బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగిస్తుండడంతో బయటి మర్కె ట్‌లో సన్నబియ్యం విక్రయాలు తగ్గి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.
అదుపులోకి వచ్చిన సన్నాల ధరలు
రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మార్కెట్‌లో సన్నబియ్యానికి డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు పరిశీలిస్తే బీపీటీ రకం సోనా బియ్యం రూ.5,400, ఆర్‌ఎన్‌ఆర్ రూ.5,400, జైశ్రీరామ్ రూ. 5,500, హెచ్‌ఎంటీ రైస్ రూ.5,600 ఉన్నాయి. గత నెలతో పోలిస్తే ప్రస్తుత మార్కెట్లో కొత్త బియ్యం రకాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ నెలలో క్వింటాల్ రూ.400 నుంచి రూ. 600ల ధరలు వరకు తగ్గాయి.
లబ్ధిదారుల సంతోషం
గతంలో రేషన్‌కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో వాటిని తినకుండా విక్రయించి సన్నబియ్యం కొనుగోలు చేశారు. దీంతో సన్నబియ్యం ధరలు మార్కెట్లో విపరీతంగా పెరిగాయి. చౌక ధరల దుకాణాల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదని గ్రహించిన ప్రభుత్వం ఈ ఉగాది నుంచి లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ ప్రారంభిం చింది. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం నాణ్యతతో ఉండడంతో మార్కెట్లో కొనుగోలు చేయకుండా లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పడితే మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం జిల్లాలో 80శాతం మేర పంపిణీ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సన్నబియ్యం పంపిణీ బృహత్తర పథకం
మా ఇంట్లో ఐదు యూనిట్లకు ఆరు కిలోల చొప్పున 30 కిలోల బియ్యం వస్తాయి. సుమారు 20రోజులు సరిపోగా మరో పది రోజులకు బియ్యం కొనుగోలు చేస్తే నెల గడుస్తుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం కొంత ఆర్థికంగా ఊరట కలుగుతోంది. నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయడం ఆనందంగా ఉంది.
బింగి గణేష్, నేత కార్మికుడు, రాజాపేట మండలం, రఘునాథపురం గ్రామం.