R Krishnaiah: చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:58 AM
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

బీసీ కోటా బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టండి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీలో ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో అమిత్‌షాతో కృష్ణయ్య సమావేశమయ్యారు.
విద్యా ఉద్యోగాల్లో జనాభాకనుగుణంగా బీసీల రిజర్వేషన్లు 27 నుంచి 56 శాతానికి పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పనకు బీసీ చట్టం తేవాలన్న ఆర్.కృష్ణయ్య.. ప్రైవేట్ రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీల డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అమిత్‌షా తనకు హామీ ఇచ్చారని ఆర్.కృష్ణయ్య తెలిపారు.