Share News

Bhadrachalam: భద్రాద్రి భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:52 AM

భద్రాచలంలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Bhadrachalam: భద్రాద్రి భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామేశ్‌ కన్నుమూత

  • ఇంకా లభ్యంకాని మరో మేస్త్రీ ఉపేందర్‌రావు ఆచూకీ

  • కొనసాగుతున్న సహాయక చర్యలు

భద్రాచలం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం భవనం కూలగా.. అందులో ఇద్దరు స్థానిక తాపీ మేస్త్రీలు చిక్కుకుపోయారని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టగా మేస్త్రీ కామేశ్వరరావు అలియాస్‌ కామేశ్‌ ఆర్తనాదాలు వినిపించాయి. దీంతో రెస్క్యూ బృందాలు బుధవారం అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు శిథిలాల నుంచి తీవ్రంగా గాయపడ్డకామేశ్‌ను బయటకు తీశాయి. ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించాయి. అక్కడ కామేశ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు.


ఇటు శిథిలాల్లో చిక్కుకున్న మేస్త్రీ ఉపేందర్‌రావు ఆచూకీకోసం ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి కాలరీస్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే శిథిలాల కింద దుర్వాసన వస్తుండటంతో ఉపేందర్‌రావు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. యంత్రాలతో కాకుండా కింద నుంచి తవ్వుకుంటూ లోపలికి వెళ్లే యత్నం చేస్తున్నారు. ఉపేందర్‌రావు ఆచూకీ కోసం అతడి కుటుంబసభ్యులు, బంధువులు ఘటనాస్థలం వద్దే ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌, ఆర్డీవో దామోదర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఇక భవన యజమానులు శ్రీపతి దంపతులు తమ అదుపులోనే ఉన్నారని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. శిథిలాలు తొలగిస్తుండగా ధ్వంసమైన లాకర్‌లో దొరికిన పత్రాలను భద్రపరిచినట్లు చెప్పారు. కాగా, ఈ ఆల య నిర్మాణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? శ్రీపతి గురించి వివరాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. అతడికి ఏపీలోని ఓ సేవా సంస్థతో ఉన్న అనుబంధం, వివరాలు ఆరా తీసినట్లు సమాచారం.

Updated Date - Mar 28 , 2025 | 04:52 AM