Hyderabad: పెట్రోల్ బంకు, ఫంక్షన్ హాల్‌కూ రైతుబంధు
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:30 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోని తెల్లాపూర్‌లో ఓ రైతుకు 10 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి ధర ఎకరా రూ.50 కోట్లకు పైనే పలుకుతోంది.

తెల్లాపూర్‌లో రూ.500 కోట్ల ఆసామికి ‘రైతు బంధు’ వర్తింపు
విల్లాలు, అపార్ట్‌మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం
పార్కింగ్‌కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి
పలుచోట్ల అనధికార లేఅవుట్లు, నాలా భూములకూ చెల్లింపు
రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేలో సిత్రాలు.. అధికారుల విస్మయం
సర్వే నంబర్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే
సాగుకు తగని భూములు తక్కువే.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోని తెల్లాపూర్‌లో ఓ రైతుకు 10 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి ధర ఎకరా రూ.50 కోట్లకు పైనే పలుకుతోంది. ఆ లెక్కన భూమి విలువ రూ.500 కోట్లు పైనే ఉంటుంది. ఇంత ఆస్తి ఉన్న ఆ పెద్దమనిషి.. తనకున్న భూమిలోని ఓ 5 గుంటల స్థలానికి ‘రైతు బంధు’ తీసుకుంటున్నాడు. రైతు భరోసా క్షేత్రస్థాయి సర్వేకి వచ్చిన అధికారులు ఆ 5 గుంటల స్థలాన్ని వాహనాల పార్కింగ్‌కు అద్దెకు ఇచ్చినట్టు గుర్తించారు. అటూ ఇటూ అపార్ట్‌మెంట్లు, విల్లాలు వంటి నిర్మాణాల మధ్య ఉండి, వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్న ఆ స్థలానికి పెట్టుబడి సాయం ఆగిపోకుండా చూడాలని సదరు రైతు అధికారులను వేడుకున్నాడు. దీంతో సర్వేకు వెళ్లిన సంగారెడ్డి అదనపు కలెక్టర్(రెవెన్యూ) మాధురి, బృందం కంగుతిన్నది. ఇదే కాదు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకం అమలులో ఇలాంటి సిత్రాలు ఎన్నో ప్రస్తుత నర్వేలో బయటపడుతున్నాయి. పెట్రోల్ బంకు, ఫంక్షన్ హాళ్లు, పార్కింగ్ స్థలాలను నిర్వహిస్తున్న భూములకూ కొందరు ఆరేళ్లు పాటు రైతుబంధు సాయం పొందినట్టు తెలుస్తోంది.
పెట్రోలు బంకు, ఫంక్షన్ హాల్‌కు ‘పెట్టుబడి సాయం’
జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యం లో సాగుకు యోగ్యం కానీ భూముల గుర్తింపునకు అధికారులు గురువారం నుంచి క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. సర్వే నెంబర్ల ఆధారంగా గతంలో రైతుబంధు పొందిన భూముల వివరాలను పరిశీలిస్తున్నారు. సర్వే వివరాలతో సీసీఎల్‌ఏకు రోజువారీ నివేదికలు పంపిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయి విచారణలో పలు అం శాలు రెవెన్యూ అధికారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలో ఉన్న కర్తనూర్‌లో ఓ పెట్రోల్ బంకుకు రైతు బంధు తీసుకుంటున్నారు. సదరు భూమిలో కొన్నేళ్లుగా పెట్రోల్‌బంకు కొనసాగుతున్నా.. సాగు భూమిగా చూపి రైతుబంధు పొందినట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో మరో వ్యక్తి 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ నిర్మించి దానిని నెలకు రూ.లక్షకు మరొకరికి అద్దెకు ఇచ్చారు. కానీ, ఆ ఫంక్షన్ హాల్ భూమికీ రైతు బంధు కింద సాయం పొందిన ట్లు గుర్తించారు. తెల్లాపూర్‌లో ఓవ్యక్తి కార్ పార్కింగ్ కోసం కేటాయించిన నాలుగు గుంటల స్థలానికి రైతు బంధు పొందుతున్నారు. కొన్నిచోట్ల ఆలయాలకు, మరికొన్ని చోట్ల పరిశ్రమలకు, లేఅవుట్లగా ఉన్న స్థలాలకు, నాలా పొందిన భూములకు కూడా చెల్లింపులు జరిగినట్టు అధికారులు తమ సర్వేలో గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు బయటికొస్తున్నాయి. ముఖ్యంగా రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో సాగులో లేని వేల ఎకరాల భూములకు రైతు బంధు చెల్లించినట్లు తాజా సర్వేలో వెలుగుచూస్తోంది..
ఆరేళ్లలో రూ.25,672 కోట్లు పక్కదారి
వ్యవసాయ శాఖ గత ఏడాది జూలైలో మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన నివేదిక ప్రకారం.. గత ప్రభుత్వ పాలనలో రైతు బంధు కింద ఆరేళ్లలో.. సాగు చేయని భూములకు రూ.25,672 కోట్లు పెట్టుబడి సాయం అందింది. మొత్తం 12 విడతల్లో రూ.80,453 కోట్ల నిధులు రైతు బంధు పథకం కోసం విడుదల చేయగా.. అందులో రూ.25,672 కోట్ల సాగులో లేని భూములకు అందినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 157.43 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 74.58 లక్షల మంది పట్టాదారులు ఉన్నారని నివేదికలో తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ ఏటా 152.51 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారని వ్యవసాయ శాఖ వివరించింది. ఈ లెక్కన చూసినా సాగులో లేని సుమారు 4.92 లక్షల ఎకరాల భూములకు రైతు బంధు అందినట్లు తెలుస్తోంది.
‘రైతు భరోసా’వర్తించని భూమి తక్కువే !
రాష్ట్రంలో ‘రైతు భరోసా’ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. సాగు యోగ్యం కానీ భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. సాగు యోగ్యం కాని భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని ప్రభు త్వం నిర్ణయించిన నేపథ్యంలో రైతు బంధు లబ్ధిదారు ల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. అయితే, పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న పలు ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో సాగుయోగ్యం కానివి కింద అధికారులు గుర్తించిన భూములు చాలా స్వల్పంగా ఉన్నా యి. సర్వే జరిగిన పది గ్రామాల్లో ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన పరిశీలనలో ఈ విషయం తేలింది. రియల్ ఎస్టే ట్ వెంచర్లు, పరిశ్రమలకు మళ్లిన భూములు, రహదారుల కింద వదిలేసిన భూములు, రాళ్లు రప్పలున్న భూములు, ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను మాత్రమే సాగు యోగ్యం కానివిగా అధికారులు గుర్తిస్తున్నారు. ఉదాహరణకు.. వరంగల్ ఉమ్మడి జిల్లా చిట్యాల మండలంలోని చైన్ పాక రెవెన్యూ గ్రామంలో 544 మంది రైతులకు చెందిన 1,264 ఎకరాలకు గతంలో రైతుబంధు సొమ్ము అందింది. అయితే, రైతు భరోసా సర్వేలో ఇందులో 21 మంది రైతులకు చెందిన 27.25 ఎకరాలను మాత్రమే సాగుకు పనికిరాని భూమిగా గుర్తించారు. అంటే, చైన్‌పాక్ పరిధిలో సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో సుమారు 2,600 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో సాగు యోగ్యం కాని భూమి దాదాపు 20 ఎకరాలుగా గుర్తించారు. ఈ 20 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వర్తించకపోవచ్చు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో మొత్తం 1,638 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో 4.25 ఎకరాలను సాగుకు యోగ్యం కాదని తేలింది. కొత్తపల్లి గ్రామంలో 1071 ఎకరాలుండగా 4 గుంటల భూమి సాగు యోగ్యం కాని భూమి జాబితాలో చేరింది. లోదిపూర్‌లో 255 ఎకరాలకు గాను 4.10 ఎకరాలను, నాచారంలో 789 ఎకరాలకు గాను 8.36 ఎకరాలను సాగుకు యోగ్యం కాదని గుర్తించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్‌లోని 822 ఎకరాల భూముల్లో 3.07 ఎకరాలను సాగు యోగ్యం కానీ భూములుగా గుర్తించారు.
నల్లగొండ జిల్లా గుడిపల్లిలో 1,516 మంది రైతులకు చెందిన 4,223 ఎకరాలకు రైతుబంధు అందేది. ఇందులో 30 మందికి చెందిన 20 ఎకరాలను సాగు యోగ్యం కాని భూమిగా గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించారు. చెరువులో పట్టాలు పొందిన మరో 14 మందికి చెందిన 35 ఎకరాల భూమి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.
కరీంనగర్ మండలం ఇరుకుల గ్రామంలో 1348 మంది రైతులకు చెందిన 1223 ఎకరాల భూమికి రైతుబంధు అందేది. తాజా సర్వేలో ఇటుక బట్టీలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న 52 ఎకరాలను సాగు యోగ్యం కాని భూమిగా గుర్తించారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం రెవెన్యూ గ్రామంలో గతంలో 2585 ఎకరాల భూమికి రైతుబంధు వచ్చేది. రైతు భరోసా సర్వేలో 28 ఎకరాలను వెంచర్లగా గుర్తించారు. కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో గతంలో 2912 ఎకరాలకు రైతుబంధు ఇచ్చేవారు. ఇప్పుడు సర్వేలో 20 ఎకరాలను వెంచర్ల భూమిగా గుర్తించారు.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సర్వారం రెవెన్యూ పరిధిలో మొత్తం 1089 ఎకరాల భూమి ఉండగా... ఇళ్ల ప్లాట్లుగా మారిన 27 ఎకరాలను రైతు భరోసా నుంచి తొలగించారు.
దండుమైలారంలో 700 ఎకరాల కోత
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో మొత్తం 5,526 ఎకరాల రెవెన్యూ భూమి ఉండగా 3,788 ఎకరాలకు రైతుబంధు అందేది. రైతు భరోసా సర్వేలో ఇందులో సుమారు 400 ఎకరాలను గుట్టల ప్రాంతంగా గుర్తించారు. మరో 300 ఎకరాల్లో వెంచర్లు, ఫామ్‌హౌజ్‌లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు 700 ఎకరాలు సాగుయోగ్యం కాని భూములు జాబితాలో చేరినట్టు అయింది.