Delhi Judge Cash Controversy: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. సుప్రీం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:16 PM
Delhi Judge Cash Controversy: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ అంశంపై అంతర్గత విచారణకు ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ, మార్చి 21: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై (Justice yashwant Varma) అంతర్గత దర్యాప్తునకు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు సీజే నుంచి నివేదిక కోరింది సుప్రీంకోర్టు. కాగా.. వర్మ నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. మంటలార్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిక వర్మ నివాసంలో కోట్ల కొద్దీ డబ్బుల కట్టలు బయటపడ్డాయి. సుమారు 50 కోట్ల వరకూ నోట్ల కట్టలు బయటపడ్డాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత మొత్తం ఎవరివన్న దానిపై కూడా దర్యాప్తు జరపాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.
ఈ నెల 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో మంటలు వ్యాపించాయంటూ ఆయన కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్న సమయంలో ఒక రూంలో మొత్తం డబ్బుల కట్టలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. మంటల్లో దాదాపు ఐదారు కోట్లు కూడా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన మొత్తం డబ్బుల కట్టలను ఫైర్ సిబ్బంది ఫోటోలు తీసి ఇన్‌చార్జికు పంపించగా.. ఆయన ఢిల్లీ కమిషనర్‌కు పంపినట్లు సమాచారం. వెంటనే ఢిల్లీ కమిషనర్ ఈ ఫోటోలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపించారని.. ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మోదీ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ డబ్బులు తనవి కాదంటూ జస్టిస్ వర్మ కూడా బుకాయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంత పెద్ద వ్యవహారంలో బదిలీ మాత్రమే సరిపోదని, ఆయనను వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించాలని కొలీజియంలోని కొంతమంది సభ్యులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా చేసేందుకు యశ్వంత్ వర్మ నిరాకరించినట్లు సమాచారం. ఓ న్యాయమూర్తి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడం న్యాయచరిత్రలో, న్యాయవర్గాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే
Read Latest National News And Telugu News