GSDP growth: జీఎస్‌డీపీ 16.12 లక్షల కోట్లు
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:44 AM
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ధరల వద్ద 10.1 శాతం మేర వృద్ధి నమోదైంది.

సేవారంగానిదే అత్యధిక వాటా.. 66.3ు
ఉపాధిలో అగ్రభాగాన వ్యవసాయ రంగం
42.7% మంది శ్రామికులకు అదే ఆధారం
రాష్ట్రాలకు పన్నుల వాటాను 50ుకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ధరల వద్ద 10.1 శాతం మేర వృద్ధి నమోదైంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ.. ఇలాంటి స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 2024-25లో జీఎ్‌సడీపీ రూ.16,12,579 కోట్లుగా ఉందని, గతేడాదితో పోలిస్తే 10.1శాతం మేర వృద్ధి నమోదైందని వెల్లడించింది. ఇదే సమయంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.3,31,03,215 కోట్లు అని, వృద్ధి రేటు 9.9 శాతమని వివరించింది. కాగా, జీఎ్‌సడీపీకి జోడించిన రాష్ట్ర స్థూల విలువ(జీఎ్‌సవీఏ)లో సేవా రంగమే అత్యధిక వాటాను (66.3 శాతం) అందించింది. పారిశ్రామిక రంగం 16.4శాతం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 17.3 శాతం వాటా అందించాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు జీఎ్‌సడీపీలో తక్కువ వాటా కలిగి ఉన్నా.. రాష్ట్ర శ్రామిక రంగంలో మొత్తం 42.7 శాతం మందికి ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం.
పరిశ్రమలతో 22.5% మందికి ఉపాధి
రాష్ట్రంలోని పరిశ్రమలు 22.5 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఔషధాలు, బయో టెక్నాలజీ, విద్యుత్తు వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పన్నుల వాటాను 50 శాతానికి పెంచండి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న పన్నుల వాటాను ఇప్పుడున్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేసింది. కొత్త బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి ఈ అంశంపై సమగ్ర నివేదికను సమర్పించామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి 2.437 శాతం మేర వాటా లభిస్తే... 15వ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి 2.102 శాతానికి తగ్గిందని తెలిపింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని, దేశ ఆర్థికవృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానం ఉండాలని తెలిపింది. రాష్ట్రాలకు కనీసం 50 శాతం వాటాను అందించాలని డిమాండ్ చేసింది. వాటాను నిర్ధారించే సమయంలో రాష్ట్రాల జీఎ్‌సడీపీకి 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర పన్నుల పంపిణీలో న్యాయమైన వాటాను సాధించడంతో పాటు ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తలసరి ఆదాయంలో అగ్రస్థానం
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751
దేశ సగటు కన్నా రూ.1,74,172 ఎక్కువ
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం 2024-25లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751గాఉంది. వృద్ధి రేటు 9.6శాతం. జాతీయ తలసరి ఆదాయం రూ.2,05,579 కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,74,172 అదనంగా ఉంది. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం 1.8రెట్లు ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా చూస్తే రంగారెడ్డిలో అత్యధికంగా రూ.10,55,913లక్షలు ఉండగా.. వికారాబాద్‌లో అత్యల్పంగా రూ.1,98,401ఉంది. మొదటి ఐదు స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్(రూ.5,54,105), సంగారెడ్డి(రూ.3,45,478), మేడ్చల్(రూ.3,43,130), కొత్తగూడెం(రూ.3,21,281) ఉన్నాయి.