రైతు భరోసా కోత పడేది 2.20 లక్షల ఎకరాలకే
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:04 AM
రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా 1.49 కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల ఎకరాలుండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు 10 శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది.

సాగుయోగ్యం కాని భూమి స్వల్పమే
1.49 కోట్ల ఎకరాలకు చెల్లించాలి
అధికారుల సర్వేలో తేలిన లెక్కలు
నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ
ఒక ఎకరం వాళ్లకు ముందు చెల్లింపు
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా 1.49 కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల ఎకరాలుండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు 10 శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేయిస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం సాగుయోగ్యం కాని భూముల లెక్క చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. 2,20,527 ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కానిది ఉన్నట్లు ఇప్పటివరకు అంచనాల్లో తేలింది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లోని 10,976 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయగా తేలిన లెక్క ఇది. మొత్తం భూముల్లో సాగు యోగ్యం కాని భూమి కేవలం 1.44 శాతం మాత్రమే. దీంతో ప్రభుత్వం తొలుత అంచనా వేసినట్టు కాకుండా 1,49,90,344 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. ఎకరాకు రూ.6 వేల ప్రకారం ఈ పంటకు సుమారుగా రూ.8,994 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
గతంలో ఒక పంటకు రూ.5 వేలు ఇచ్చేటప్పుడు ఒక్కో దఫా రూ.7,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు దాని కంటే దాదాపు రూ.1,494 కోట్లు అదనంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. వ్యవసాయ యోగ్యం కాని కొండలు, గుట్టలు, లేఔట్లు వేసిన భూములు, ప్రభుత్వాలు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు ఎక్కువగానే ఉన్నా అవన్నీ రెవెన్యూ రికార్డులో అప్‌డేట్ కాలేదు. దీనివల్లే సాగు యోగ్యంకాని భూముల సంఖ్య పెద్దగా లెక్కల్లోకి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగు యోగ్యం కాని భూముల సర్వే ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగనుంది. ఒకవైపు రైతు భరోసాకు అర్హులైన వారికి డబ్బు జమచేస్తూనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తారు. మరోవైపు శనివారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ అయ్యే అవకాశాలున్నాయి. తొలుత ఒక ఎకరం, తర్వాత రెండెకరాలు తర్వాత మూడెకరాలు.. ఇలా దశల వారీగా జమ చేస్తారు. ఈ రైతు బంధు నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో నిధుల విడుదలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.