Share News

MLC Elections : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:48 PM

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. కరీంనగర్‌లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధికులు నామినేషన్లు దాఖలు చేశారు.

MLC Elections : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

కరీంనగర్, ఫిబ్రవరి 10: నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు సాయంత్రంతో నామినేషన్ల దాఖల గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను మంగళవారం పరిశీలించనున్నారు.

అయితే ఈ నామినేషన్లు ఉప సంహరించుకోనే గడువు 13వ తేదీతో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను మార్చి 8వ తేదీలోగా పూర్తి చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - మెదక్‌ పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ, నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీకీ ఇప్పటి వరకు మొత్తం 85 నామినేషన్లు దాఖలైనాయి.


ఇక వరంగల్‌ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ నామినేషన్‌ను వేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం గమనార్హం.

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి


తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లో మూడు, మూడు చొప్పున మొత్తం 6 ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఈ ఆరు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిలకు అనివార్యమైనాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

For Telangana News And Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:03 PM