Tummala: ఒక్క రైతూ నష్టపోకూడదు
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:01 AM
రైతుభరోసా సర్వే పకడ్బందీగా చేయాలని.. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..

రైతుభరోసా సర్వేపై వ్యవసాయాధికారులతో తుమ్మల
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా సర్వే పకడ్బందీగా చేయాలని.. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. సాగుకు అనువుగాని భూములను గుర్తించి, మంగళవారం నుంచి జరిగే గ్రామసభల్లో ఆ భూముల వివరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రైతుభరోసా పథకం అమలుకోసం చేపట్టిన సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
26వ తేదీ నుంచి పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో.. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని, ఈ క్రమంలో సాంకేతిక సమస్యలేవైనా ఎదురైతే వెంటనే తమకు తెలియజేయాలని సెక్రటరీ రఘునందన్ సూచించారు. అలాగే, మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సోమవారం ఆయన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కెట్లవారీగా పనుల పురోగతి, పత్తి, మిర్చి పంటల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో చేపట్టిన పనుల పురోగతి అంత ఆశాజనకంగా లేదని, ప్రతి నెలకోకసారి పనుల పురోగతిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.