Sangareddy: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:31 AM
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ప్రియుడు, అతని మిత్రులతో కలిసి గొంతు కోసి, కర్రతో తలపై బాది కిరాతకంగా చంపేసింది.

సంగారెడ్డి జిల్లా పల్పనూర్‌లో ఘటన.. నిందితుల అరెస్టు
హత్నూర, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ప్రియుడు, అతని మిత్రులతో కలిసి గొంతు కోసి, కర్రతో తలపై బాది కిరాతకంగా చంపేసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూర్‌లో ఈ నెల 24న ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా బిక్కునూర్ మండలం మల్లుపల్లికి చెందిన మాలే నారాయణ (45) స్వగ్రామం లో భార్య, పిల్లలను వదిలి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్‌లో ఓ వ్యవసాయ అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి నారాయణ భార్య అతనుండే చోటుకే వచ్చి ఉంటోంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర బంధం ఉన్న విషయం తెలుసుకున్న నారాయణ ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఆమె పథకం ప్రకారం ఈ నెల 24న పల్పనూర్ గ్రామ శివారుకు భర్త నారాయణను తీసుకెళ్లింది. అక్కడ కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రియుడితో పాటు అతని మిత్రులతో కలిసి భర్తను ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోసి, కర్రతో బాది దారుణంగా హత్య చేసింది. మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానంతో ఆమెను తమదైన శైలిలో విచారించగా విషయం బయటపడింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్