ఐనవోలులో ఘనంగా ప్రారంభమైన మల్లికార్జున స్వామి జాతర

ABN , First Publish Date - 2021-01-13T04:03:47+05:30 IST

ఐనవోలులో ఘనంగా ప్రారంభమైన మల్లికార్జున స్వామి జాతర

ఐనవోలులో ఘనంగా ప్రారంభమైన మల్లికార్జున స్వామి జాతర
విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్న ఐనవోలు ప్రాంగణం

 వేలాదిగా వస్తున్న భక్తజనం 

కిక్కిరిసిపోతున్న పరిసర ప్రాంతాలు

 జాతరకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు: ఇంచార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌

ఐనవోలు, జనవరి 12: తెలంగాణాలోనే సుప్రసిద్ధ శైవక్షేత్రమైన ఐనవోలులో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత స్వామి వారికి ఒగ్గుపూజారులు మేలుకొలుపుచేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాతఃకాలంలో విఘ్నేశ్వరపూజ, రుద్రాభిషేకం, నూతన వస్త్రాలంకరణ చేశారు. ఉదయం గణపతి పూజ శైవశుద్ధి  పుణ్యాహవాచనం నిర్వహించారు. ఉత్సవ ప్రారంభ సూచికగా కాషాయ ధ్వజ పతాకాలను చేతపట్టి మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఆపై ఆలయ శిఖరం, క్షేత్రపాలకుడు అంజనేయస్వామి గుడిపై ఎగురవేశారు. అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహానివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ చేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు.  13న  బుధవారం భోగి, 14న గురువారం మకర సంక్రాంతి రెండు పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో బుధవారం ఉదయం స్వామి వారికి ప్రాతఃకాలం మేలుకొలుపుతో పూజలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్వామిని దర్శించుకొవచ్చని ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. ఉత్సవాల ప్రారంభంలో ఈవోతో పాటు దేవస్థానం చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌, వేద పండితుడు గట్టు పురుషోత్తంశర్మ, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌, ముఖ్య అర్చకుడు శ్రీనివాస్‌, పురోహితుడు మధుకర్‌శర్మ, అర్చకులు, ధర్మకర్తలు, ఆలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. జాతర ప్రారంభంకావడంతో మల్లికార్జునస్వామి సన్నిధికి భక్తుల రాక మొదలైంది.  మరోవైపు  పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్లూఎస్‌, వైద్యశాఖ, విద్యుత్‌, ఎక్సైజ్‌, పీఆర్‌, డబ్లూజీహెచ్‌ఎంసీ అధికారులు జాతర విధుల్లో చేరారు. 

విస్తృత బందోబస్తు ఏర్పాట్లు : సీపీ ప్రమోద్‌కుమార్‌

ఐనవోలు జాతరలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని వరంగల్‌ ఇంచార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. జాతర ఏర్పాట్ల ను ఈస్ట్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మి, పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్‌లతో కలిసి సీపీ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపారు. జాతరలో అవాం ఛనీయ సంఘటనలు తలెత్తకుండా  500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. ఈ కార్యక్రమంలోదేవస్థానం చైర్మన్‌ ఎం.సంపత్‌కుమార్‌,  డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ మధుమతి తదితరులు  పాల్గొన్నారు. 



















Updated Date - 2021-01-13T04:03:47+05:30 IST