తెలంగాణ-ఆంధ్ర మధ్య ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి!
ABN , First Publish Date - 2022-10-14T07:23:19+05:30 IST
భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్నారు.
- దేశంలోనే తొలి భారీ నిర్మాణం..
- వంతెన పొడవునా గ్లాస్ వాక్‌వే
- పర్యాటకానికి కొత్త రూపు..
- 1,082 కోట్లతో 30 నెలల్లో పూర్తి
- హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కి.మీ. ప్రయాణం తగ్గుతుంది: గడ్కరీ
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్‌లో ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా-కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద ఇది నిర్మితం కానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలో రెండోది.. దేశంలో మొదటిది అవుతుందని.. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని.. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్ వాక్‌వే ఉంటుందని.. గోపురం వంటి పైలాన్లు ఉంటాయని వివరించారు.