అనధికార లేఅవుట్లను తొలగించండి

ABN , First Publish Date - 2022-05-08T05:13:20+05:30 IST

అనధికార లేఅవుట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, అటువంటి వాటిని వెంటనే ఆపాలని వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు.

అనధికార లేఅవుట్లను తొలగించండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా బిల్డింగ్‌ నిర్మంచకూడదు

అనధికార లేఅవుట్‌లపై క్షేత్ర స్థాయిలో సర్వే చేయాలి : కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి (కలెక్టరేట్‌), మే 7: అనధికార లేఅవుట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, అటువంటి వాటిని వెంటనే ఆపాలని వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో అన్నమయ్య పట్టణ అభివృద్ధి సంస్థ (అడా) ఆధ్వర్యంలో లేఅవుట్‌, భవన నిర్మాణాలు, నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా జిల్లా కేంద్రంలో స్థిరపడాలని కోరుకుంటారన్నారు. రింగు రోడ్డు వేసిన తర్వాత రాయచోటి పట్టణం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసునని గుర్తు చేశారు. రాబోయే పది సంవత్సరాలకు రాయచోటి చాలా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా ఇక నుంచి భవన నిర్మాణాలను ప్లాన్‌ ప్రకారం అప్రూవల్‌ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్నా భూమి అనేది చాలా అవసరమని, కానీ చాలాచోట్ల అప్రూవల్‌ లేకుండా అనధికారికంగా లేఅవుట్‌లు వేస్తున్నారని, అటువంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి నిలుపుదల చేయాల్సిన బాధ్యత వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులదేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇక నుంచి జిల్లాలో ఎక్కడా కూడా అగ్రికల్చర్‌ ల్యాండ్‌ లేఅవుట్‌లో రిజిస్ర్టేషన్‌ జరగకూడదని స్పష్టం చేశారు. లేఅవుట్లు అప్రూవల్‌ కొరకు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ వారు మంగళ, శనివారాల్లో మాత్రమే రాయచోటిలో అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలో అనధికార లేఅవుట్‌లను ఎవరెవరు వేశారో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అలాగే డీకేటీ ల్యాండ్‌లో లేఅవుట్‌లు వేసి ఉంటే వెంటనే అలాంటి వివరాలు పంపాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని, అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతానికి బెంగుళూరు, చెన్నై దగ్గరగా ఉందని, నాలుగు లక్షల మందికి 24/7 నీళ్లు ఇచ్చేలా రాయచోటి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, అన్నమయ్య పట్టణ అభివృద్ధి సంస్థ (అడా) వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మి, డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Read more