MCD Election Results: బీజేపీ ఓటమికి 3 ప్రధాన కారణాలు
ABN , First Publish Date - 2022-12-07T19:05:39+05:30 IST
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో 250 వార్డులకు ఆప్ 134 వార్డులు గెలుచుకునవి మెజారిటీ సాధించింది. బీజేపీ 104 సీట్లతో ...
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల్లో 250 వార్డులకు ఆప్ 134 వార్డులు గెలుచుకునవి మెజారిటీ సాధించింది. బీజేపీ 104 సీట్లతో సరిబెట్టుకుంది. కాంగ్రెస్ కేవలం 9 సీట్లకు పరిమితమైంది. బీజేపీపై ఆప్‌దే పైచేయి కావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ, గెలుపొందిన సీట్లు ప్రకారం బీజేపీ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలపై ఎంసీడీ ఫలితాల ప్రభావం ఉండబోదని చెబుతున్నారు. 15 ఏళ్లు పాలించిన ఎంసీడీని బీజేపీ నిలబెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ అది ఇప్పుడు చేజారిపోయిందని, ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయని కొందరు అంటున్నారు. ప్రధానంగా 3 కారణాలను వారు చెబుతున్నారు.
1.టిక్కెట్ల పంపిణీలో తప్పిదాలు
సరైన అభ్యర్థులకు టిక్కెట్ల పంపిణీ చేయడంలో జరిగిన పొరపాట్లు ఒక కారణమని పార్టీ సీనియర్ నేతలు కొందరు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యులతో (ఎంపీలతో) సరైన సంప్రదింపులు జరపకుండా టిక్కెట్ల పంపిణీ జరిగిందని వారంటున్నారు.
2.దయనీయంగా బూత్ మేనేజిమెంట్
బూత్ మేనేజిమెంట్ దయనీయంగా ఉండటం మరో కారణం. పార్టీకి చెందిన ఏ ఒక్కరు ఓటరు స్పిప్పులను వార్డులకు వెళ్లి ప్రజలకు నేరుగా అందించలేదు. ఆప్ కార్యకర్తలు మాత్రం ఇంటింటికి వెళ్లి ఓటరు స్పిప్పులు అందజేశారు.
3.నాయకత్వ లోపం
ఎంసీడీ ఎన్నికలకు బీజేపీ నుంచి నాయకత్వ లేమి కొట్టిచ్చినట్టు కనిపించదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ప్రతి స్థాయిలోనూ అధికార కేంద్రాలు, గ్రూపులు చురుగ్గా పనిచేశాయని చెబుతున్నారు. క్యాడర్‌కు ఇతమిత్ధంగా జవాబుదారీగా వ్యవహరించిన నేతలు లేకుండా పోయారనేది పలువురి అభిప్రాయంగా ఉంది.
కాగా, ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ పనితీరు రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఏమాత్రం సంకేతం కాదని బీజేపీ నైతలు పైకి చెబుతున్నారు. అయితే, ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ ఓటమి బీజేపీ అగ్రనాయకత్వానికి ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశమేనని విశ్లేషకులు అంటున్నారు.