Qatar : కోవిడ్ కన్నా ప్రాణాంతక వైరస్ కేమెల్ ఫ్లూ?

ABN , First Publish Date - 2022-12-03T12:33:02+05:30 IST

కతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup), 2022పై ప్రాణాంతక కేమెల్ ఫ్లూ

Qatar : కోవిడ్ కన్నా ప్రాణాంతక వైరస్ కేమెల్ ఫ్లూ?
Camel Flu

న్యూఢిల్లీ : కతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup), 2022పై ప్రాణాంతక కేమెల్ ఫ్లూ (Camel Flu) ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) అని కూడా పిలుస్తారు. ఈ పోటీలను తిలకించడం కోసం సుమారు 12 లక్షల మంది అభిమానులు వస్తారనే అంచనాల నడుమ ఈ వైరస్ వ్యాపించే అవకాశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

కోవిడ్-19, మంకీ పాక్స్ వంటి ఎనిమిది ఇన్ఫెక్షన్ రిస్క్‌లలో కేమెల్ ఫ్లూ ఒకటని ‘‘న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్’’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ వల్ల వచ్చే వైరల్ రెస్పిరేటరీ డిసీజ్ ఎంఈఆర్ఎస్‌ను మొదట సౌదీ అరేబియాలో 2012లో గుర్తించారు. ఇది జూనోటిక్ వైరస్. అంటే జంతువులు-మానవుల మధ్య ఇది వ్యాపిస్తుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్, దక్షిణాసియా దేశాల్లోని ఒంటెలకు, ఈ వైరస్‌కు సంబంధం ఉంది. కేమెల్ ఫ్లూను కోవిడ్-19కు ప్రాణాంతక సోదరునిగా పరిగణిస్తారు. ఈ వైరస్ సోకినవారిలో మూడో వంతు మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి వచ్చిన కేసుల్లో 35 శాతం మంది మరణించారు. మహమ్మారిగా మారే అవకాశంగల వైరస్‌లలో కేమెల్ ఫ్లూ ఒకటని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.

లక్షణాలు

జ్వరం, దగ్గు, శ్వాస పీల్చి, వదలడంలో ఇబ్బందులు; న్యూమోనియా సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఎంఈఆర్ఎస్ రోగుల్లో ఈ పరిస్థితులు ప్రతిసారీ కనిపించవు. అతిసార వంటి లక్షణాలు కనిపిస్తాయి. అస్వస్థత తీవ్రమైతే శ్వాస పీల్చి, వదలడంలో ఇబ్బందులు పెరుగుతాయి. దీంతో మెకానికల్ వెంటిలేషన్ లేదా ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం తప్పనిసరి అవుతుంది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, కేన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులుగలవారు మరణించే అవకాశం ఉంటుంది.

ఎలా వ్యాపిస్తుంది?

ఎంఈఆర్ఎస్ (కేమెల్ ఫ్లూ) జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన ఒంటెలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలుగలవారికి ఇది సోకుతుంది. ఏ విధంగా వ్యాపిస్తుందో కచ్చితంగా చెప్పడం ఇప్పటి వరకు సాధ్యంకావడం లేదు.

వ్యాక్సిన్ ఉందా?

ఈ వ్యాధి సోకినవారికి నిర్దిష్టమైన చికిత్స కానీ, వ్యాక్సిన్ కానీ లేదు. కొన్ని ఔషధాలు క్లినికల్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి. రోగి పరిస్థితినిబట్టి చికిత్స చేయవలసి ఉంటుంది. ఒంటెలు ఉండే పరిసరాల్లోకి వెళ్లినవారు, వాటిని ముట్టుకునేవారు చేతులు శుభ్రంగా కడుగుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Updated Date - 2022-12-03T12:33:07+05:30 IST