Ugadi Pachadi: ఉగాదినాడు 6 రుచుల పచ్చడి ఎందుకు తింటారు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:29 PM
ఉగాది పండగనాడు చేసుకునే ఉగాది పచ్చడిలోని షడ్రుచుల కలయిక వెనక ఎన్నో మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఆ రహస్యాలు గురించి తెలుసుకుందామా..

Ugadi Pachadi: తెలుగువారు జరుపుకునే ప్రతి పండగకు ప్రత్యేక ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే ఉగాది నాడు తయారుచేసుకునే ఉగాది పచ్చడికి ఒక విశిష్టత ఉంది. వేపపువ్వు, ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు కలగలపి తయారుచేసే ఈ పచ్చడి రుచి మనిషి జీవితంలో ఎదురయ్యే సుఖ దు:ఖాల మేలు కలయికను మాత్రమే సూచించదు. వసంతకాలం మొదలయ్యే తొలినాడు మొట్టమొదట దీన్ని తింటే.. ఇందులోని పదార్థాలు రాబోయే రోజుల్లో వచ్చే వాతావరణ మార్పుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుందంట. ఉగాది పచ్చడిలో వాడే ఒక్కో పదార్థానికి కొన్ని ప్రత్యేక గుణాలున్నాయి. దీన్ని కొంచెం తిన్నా అమృతంలా అమోఘంగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
తీపి
బెల్లంలోని తీపి తిన్నప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఇది శరీరంలో కణాలు నశించకుండా కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. వాత, పిత్త దోషాలను హరించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే జీవితంలో అనుభవమయ్యే సంతోషాలకూ, ఆనందానికి, సంతృప్తికీ తీపి సంకేతం.
పులుపు
చింతపండు పులుపులోని ఆమ్లతత్వం జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. ఈ రుచి ఎక్కువ, తక్కువ కాకుండా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇది జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని మనకు బోధిస్తుంది. జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా నేర్పుగా ముందుకుసాగాలని చెబుతుంది.
ఉప్పు
ఉప్పు లేకపోతే దేన్ని తినలేం. ఆకలి, జీర్ణశక్తిని పెంపొందించే లవణాన్ని ప్రతిఒక్కరూ తప్పక తీసుకోవాలి. ఇది ఎక్కువైనా, తక్కువైనా నష్టమే. ఉప్పు లేకుంటే జీవితం కూడా చప్ప చప్పగా రుచి లేకుండా ఉంటుంది. జీవితంలో ఏ భావోద్వేగం కలిగినా తట్టుకుని నిలబడాలని ఈ రుచి తెలుపుతుంది.
వగరు
వగరు ఆటుపోట్లకు సూచిక. రుచి నచ్చినా నచ్చకపోయినా దీన్ని తప్పక స్వీకరించి ముందుకు సాగాలని దీనర్థం. మామిడికాయల్లోని చెమట అధికంగా పట్టకుండా, శరీరం దృఢంగా ఉండేలా చూస్తుంది. గాయాలు త్వరగా మానడానికి వగరు తోడ్పడుతుంది.
కారం
ఉగాది పచ్చడిలో కారం కోసం మిరియాలు, లేదా పచ్చిమిరపకాయలు వాడతారు. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని, వేడిని పెంచి ఉత్తేజాన్ని నింపుతుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ రావు. చెమట ఎక్కువగా పట్టి బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఎక్కువగా తింటే కోపం, కడుపులో మంట పెరిగి శరీరం బలహీనమవుతుంది. కష్టనష్టాలకు ఉదాహరణగా కారాన్ని చూపిస్తారు.
చేదు
ఉగాది పచ్చడిలో చేదు ప్రత్యేకంగా ఉంటుంది. చేదు అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు, అసంతృప్తి వంటి అనేక చేదు అనుభూతులను సూచిస్తుంది. ఇలా ఉగాది పచ్చడిలో ప్రతీ రుచి కూడా మన జీవితానికి సంబంధించిన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది.