Fake bank: ఉత్తుత్తి బ్యాంకు!
ABN , First Publish Date - 2022-11-10T05:32:55+05:30 IST
ఇన్నాళ్లూ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేవాళ్లనూ చూశాం..బ్యాంకుల్ని కొల్లగొట్టేవాళ్లను చూశాం.. కానీ, ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే

లేని బ్యాంకుకు 8 బ్రాంచీలు.. కోట్లలో వసూలు
తమిళనాట నకిలీ బ్యాంకుతో బురిడీ
నిందితుడి అరెస్ట్.. రూ.57లక్షలు స్వాధీనం
చెన్నై, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేవాళ్లనూ చూశాం.. బ్యాంకుల్ని కొల్లగొట్టేవాళ్లను చూశాం.. కానీ, ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే ఏర్పాటు చేసి జనాన్ని బురిడీ కొట్టించిన కేటుగాడిని ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. తమిళనాట 8 బ్రాంచీల ద్వారా డిపాజిట్లు, ఉద్యోగాల రూపేణా కోట్లు కొల్లగొట్టేశాడో ఘరానా మోసగాడు. విదేశాల్లో ఎంబీఏ చదివి, ఆ తర్వాత అక్కడే ఓ బ్యాంకులో పనిచేసి ఆ అనుభవంతో వచ్చి ఇక్కడ ఏకంగా ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి జనాన్ని ముంచేశాడు. చివరికి గుట్టురట్టయి పోలీసులకు చిక్కాడు. ఈ వ్యవహారంపై చెన్నై కేంద్ర నేరవిభాగం-బ్యాంక్ మోసం విజిలెన్స్ విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ బ్యాంకు ద్వారా రైతులు, నిరుద్యోగులకు రుణాలు ఇస్తామంటూ ఈ ముఠా మోసం చేస్తున్నట్లు ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చెన్నై పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై అంబత్తూర్ లేడాన్ వీధిలో రూరల్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆర్‌ఏఎ్‌ఫసీ బ్యాంక్) ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం అక్కడికెళ్లి విచారించగా, స్థానిక తిరుముల్లైవాయల్‌కు చెందిన చంద్రబోస్ రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆ బ్యాంకు నడుపుతున్నట్లు వెల్లడైంది.
అలాగే మదురై, ఈరోడ్, దిండుగల్, విరుదాచలం, కళ్లకుర్చి, నామక్కల్ తదితర ప్రాంతాల్లో మరో 7 శాఖలు కూడా ఉన్నట్లు తేలింది. ఇందులో సుమారు 200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ డబ్బులు తీసుకుని వివిధ రకాల ఉద్యోగాల్లో నియమించినట్లు తేలింది. ఈ బ్యాంకు శాఖల్లో 6.5 శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలు ఇస్తామంటూ అందుకు ప్రతిగా వేలాదిమంది నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. అలాగే, ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు, పొదుపు ఖాతాలకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలకడంతో బ్యాంకులో కస్టమర్లు భారీగా డబ్బు దాచుకున్నట్లు తెలిసింది. నిందితుడిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్ట్, నకిలీ ప్రింటింగ్ మెషీన్, నకిలీ ప్రభుత్వ స్టాంపులు, బెంజ్ కారు, రూ.57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
లండన్ బ్యాంకులో పనిచేసిన అనుభవంతో!
లండన్‌లో ఎంబీఏ పూర్తిచేసి, అక్కడి బ్యాంకులో పని చేసిన చంద్రబోస్, ఆ అనుభవంతో తమిళనాట నకిలీ బ్యాంకును ప్రారంభించాడు. అందుకు అవసరమైన మెషీన్లను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఒక్క అంబత్తూరు శాఖలోనే ప్రజల నుంచి రూ.3 కోట్ల వరకు డబ్బులు సేకరించి, మోసగించినట్లు పోలీసులు తేల్చారు. మిగిలిన శాఖల్లో ఏ మేరకు డబ్బు సేకరించారన్నదానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ బ్యాంకు శాఖల ఏర్పాటులో చంద్రబో్‌సకు సహకరించిన మరికొంతమంది కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఇందులో ఉద్యోగాలు పొందేందుకు లక్షలు గుమ్మరించిన ఉద్యోగులు, ఈ బ్యాంకులో డబ్బు దాచుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.