Lalu Prasad Yadav: లాలూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

ABN , First Publish Date - 2022-12-05T16:30:31+05:30 IST

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స సింగపూర్‌ లో సోమవారం..

Lalu Prasad Yadav: లాలూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు కిడ్నీ (Kidney) మార్పిడి శస్త్రచికిత్స సింగపూర్‌ (Sinagapore)లో సోమవారం జరిగింది. శస్త్రచికిత్స విజయవంతమైనట్టు లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఓ ట్వీట్‌లో తెలిపారు. తన తండ్రితో పాటు, ఆయనకు కిడ్నీ ఇచ్చిన తన పెద్ద సోదరి రోహిణి ఆచార్య (Rohini Acharya) కూడా శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కొద్ది రోజులుగా లాలూతోనే తేజస్వి యాదవ్ సింగపూర్‌లో ఉంటున్నారు.

''విజయవంతంగా కిడ్నీ శస్త్రచికిత్స జరిగిన అనంతరం నాన్నగారిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు షిప్ట్ చేశారు. కిడ్నీ ఇచ్చిన అక్కతో పాటు, మా జాతీయ అధ్యక్షుడు (లాలూ) క్షేమంగా ఉన్నారు. వారి క్షేమం కోరుతూ ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు'' అని ట్వీట్‌లో తేజస్వి చెప్పారు. ఆసుపత్రిలో లాలూ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, లాలూ శస్త్రచికిత్స విజయవంతం కావాలని, త్వరగా ఆయన స్వస్థత చేకూరాలని కోరుకుంటూ బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రార్థనలు జరిగాయి. పాట్నాలోని ఆలయాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

కాగా, సింగపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొపెషనల్‌ను పెళ్లాడి అక్కడే స్థిరపడిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీకి తండ్రికి డొనేట్ చేసేందుకు ఇటీవల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శమని, ఆయన కోసం తాను ఏది చేయడానికైనా సిద్ధమైనని ఆమె ప్రకటించారు. తాను కేవలం శరీరంలోని ఓ చిన్న ముక్కునే ఇస్తున్నానని తన తండ్రి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ముందు కూడా ''రెడీ టు రాక్ అండ్ రోల్. విష్ మి గుడ్‌లక్'' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో లాలూతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.

Updated Date - 2022-12-05T17:33:55+05:30 IST