MBBS: ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-16T10:49:21+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌(MBBS, BDS) కోర్సులకు మొదటి సంవత్సరం తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి.

MBBS: ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం

- విద్యార్థులకు డ్రస్‌ కోడ్‌

- ర్యాగింగ్‌ చేస్తే చర్యలు

ప్యారీస్‌(చెన్నై), నవంబరు 15: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌(MBBS, BDS) కోర్సులకు మొదటి సంవత్సరం తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. కళాశాలలకు ఉత్సాహంగా వెళ్లిన జూనియర్లకు సీనియర్లు గులాబి పూలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్య విద్య కోర్సులకు సంబంధించి ప్రభుత్వ కోటా కింద కేటాయించిన సీట్లకు తొలివిడత కౌన్సెలింగ్‌ గత నెల జరిగింది. ఇందులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరారు. 2022-23వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫస్టియర్‌ తరగతులు నవంబరు 15న ప్రారంభించాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఉత్తర్వుల మేరకు, మంగళవారం ఫస్టియర్‌ విద్యార్థులు ఉత్సాహంగా వైద్య విద్య కళాశాలలకు తరలివెళ్లారు.

డ్రెస్‌ కోడ్‌...

విద్యార్థులు ధరించాల్సిన కోటు, అవసరమైన వైద్య పరికరాలు ఆయా కళాశాలల యాజమాన్యాలు పంపిణీ చేయాలి. విద్యార్థినీ, విద్యార్థులు జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌, స్లీవ్‌లెస్‌ పై దుస్తులు ధరించ కూడదు. కళాశాలల్లో ర్యాంగిగ్‌ సంస్కృతిని పూర్తిస్థాయిలో అరికట్టేలా ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి. చట్టవిరుద్ధంగా ర్యాగింగ్‌ చేసే విద్యార్థులపై కఠినచర్యలు తీసుకోవాలని తమిళనాడు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-11-16T10:49:23+05:30 IST