Abaidullah Baig: పాకిస్థాన్ సీనియర్ మంత్రి అబైదుల్లా బేగ్ కిడ్నాప్.. విడుదల
ABN , First Publish Date - 2022-10-09T01:26:54+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)కి చెందిన సీనియర్ మంత్రిని

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)కి చెందిన సీనియర్ మంత్రిని ఉగ్రవాదులు అపహరించడం కలకలం రేపింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఉగ్రవాదులతో చర్చల అనంతరం శనివారం మంత్రి అబైదుల్లా బేగ్(Abaidullah Baig)తోపాటు పర్యాటకులను విడుదల చేశారు. జైలులో ఉన్న తమ సహచరులను విడిపించాలన్న డిమాండ్‌తో కూడిన వీడియో క్లిప్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన మంత్రి చూపించారు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన అనంతరం మంత్రి అబైదుల్లా బేగ్ (Abaidullah Baig) మాట్లాడుతూ.. తాను ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. నంగా పర్బత్ ప్రాంతంలో 10 మంది పర్యాటకులను హతమార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గిల్గిత్-బాల్టిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ కమాండర్ అయిన హబీబుర్ రెహ్మాన్, అతడి అనుచరులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో థాక్ గ్రామంలో రహదారిని బ్లాక్ చేసి మంత్రిని కిడ్నాప్ చేశారు. రోడ్డును బ్లాక్ చేయడంతో ఇరువైపులా ప్రయాణికులు చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు.
నంగా పర్బత్ ప్రాంతంలో విదేశీ పర్యాటకుల హత్యతో ప్రమేయమున్న వారితో పాటు డైమర్‌లో ఇతర ఉగ్ర ఘటనల్లో పాల్గొన్న తమ సహచరులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఉగ్రవాదుల చెరలో ఉన్నప్పుడు గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఫైజుల్లా మాట్లాడుతూ.. తాను అబైదుల్లా బేగ్‌తో మాట్లాడానని, ఆయన విడుదలకు చర్చలు జరుపుతున్నామని అన్నారు. కాగా, అబైదుల్లా బేగ్ తన ఇంటికి క్షేమంగా చేరుకున్నట్టు పాకిస్థాన్ అధికారిక టీవీ చానల్ జియో టీవీ పేర్కొంది. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని హుంజా నుంచి పీటీఐ తరపున బేగ్ ఎన్నికయ్యారు.