ఇద్దరు చంద్రులు

ABN , First Publish Date - 2022-10-28T05:32:36+05:30 IST

గసాన్‌ జోసేకి జెంజి సుప్రసిద్ధుడైన జెన్‌ గురువు. సోటో బుద్ధిజం తెగకు చెందిన ఆయన జపాన్‌లోని ఉర్యులో క్రీస్తుశకం 1275లో జన్మించాడు. ఆయన తల్లితండ్రులకు చాలాకాలం సంతానం లేదు. బోధిసత్వుని భక్తురాలైన అతని తల్లి... సంతానం కోసం ప్రార్ధనలు చేసింది.

ఇద్దరు చంద్రులు

జెన్‌ కథ

గసాన్‌ జోసేకి జెంజి సుప్రసిద్ధుడైన జెన్‌ గురువు. సోటో బుద్ధిజం తెగకు చెందిన ఆయన జపాన్‌లోని ఉర్యులో క్రీస్తుశకం 1275లో జన్మించాడు. ఆయన తల్లితండ్రులకు చాలాకాలం సంతానం లేదు. బోధిసత్వుని భక్తురాలైన అతని తల్లి... సంతానం కోసం ప్రార్ధనలు చేసింది. ఒకరోజు... తను ఒక ఖడ్గాన్ని మింగినట్టు ఆమెకు కల వచ్చింది. అనంతరం ఆమె గర్భవతి అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అతనే గసాన్‌.

పదకొండేళ్ళ వయసులో... తల్లితోపాటు ఆలయానికి వెళ్ళిన గసాన్‌... బాలసన్న్యాసి అయ్యాడు. పదహారేళ్ళ వయసులో హియల్‌ పర్వతం మీదకు వెళ్ళి, ధ్యాన సాధన ప్రారంభించాడు. అలా ఆరేళ్ళు గడిచాయి.

క్యోటో నగరంలో కైసాన్‌ జూకిన్‌ అనే ప్రసిద్ధ గురువు బస చేసిన విషయం గసాన్‌కి తెలిసి, అక్కడికి వెళ్ళాడు. గసాన్‌ను చూసిన కైసాన్‌ ఏమీ మాట్లాడలేదు. కానీ ఒక్క నవ్వు మాత్రం నవ్వాడు. గసాన్‌ తిరిగి హియల్‌ పర్వతం మీదకు వెళ్ళిపోయాడు, కానీ కైసాన్‌ నవ్వు మాత్రం అతణ్ణి వెంటాడింది. ‘దాని అర్థం ఏమిటి?’ అని నిరంతరం ఆలోచించేవాడు. రోజులు గడుస్తున్నా... ఆ నవ్వును మాత్రం మరువలేకపోయాడు. చివరికి... మరోసారి క్యోటోకు వెళ్ళి, కైసాన్‌ను కలుసుకున్నాడు. ఈసారి అతనితో కైసాన్‌ మాట్లాడాడు.

ఒక వెన్నెల రాత్రి... ఇద్దరూ ఆరుబయట కూర్చున్నారు. గగనంలో నిండు చంద్రుడు మెరుస్తున్నాడు. ప్రకృతి అంతా వెన్నెలతో ప్రకాశిస్తోంది. వారి హృదయాలు చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.

హఠాత్తుగా ‘‘ఇద్దరు చంద్రులు ఉన్న విషయం నీకు తెలుసా?’’ అని అడిగాడు కైసాన్‌.

‘‘లేదు, నాకు తెలీదు’’ అన్నాడు గసాన్‌.

‘‘అయితే నీకు ఇంకా అర్హత రాలేదు’’ అని వెళ్ళిపోయాడు కైసాన్‌.

తన సాధన ఇంకా పరిపూర్ణం కాలేదనీ, చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నదనీ గసాన్‌కు తెలిసివచ్చింది. అహోరాత్రులూ శ్రమించాడు. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. అతనికి ఇరవయ్యారేళ్ళ వయసు వచ్చింది. ఒక పున్నమిరోజు ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూండగా... శరీరంలోని ప్రతి అణువూ ఆనందంతో పొంగిపోసాగింది. గురువైన కైసాన్‌ నిశ్శబ్దంగా, నెమ్మదిగా, అడుగులో అడుగు వేసుకుంటూ గసాన్‌ దగ్గరకు వచ్చి... అతని చెవి దగ్గర చిటికె వేశాడు.

గసాన్‌లో ఒక మెరుపు మెరిసినట్టయింది. అతని ముఖం కాంతితో వెలిగిపోయింది. దీర్ఘ స్వప్నం నుంచి బయటపడిన అనుభూతి కలిగింది. కళ్ళు తెరిచి, ఎదురుగా ఉన్న కైసాన్‌తో ‘‘అవును. ఇద్దరు చంద్రులు ఉన్నట్టు ఇప్పుడు గ్రహించాను’’ అన్నాడు.

గౌతమ బుద్ధుడు జన్మించినదీ, జ్ఞానాన్ని పొందినదీ, నిర్వాణం చెందినదీ ... పూర్ణచంద్రుడు దివిలో ప్రకాశించే పౌర్ణమిరోజే. బయట గగనంలో పూర్ణ చంద్రుడు... మనో గగనంలో మరో చంద్రుడు. ఒకేసారి ఇద్దరు చంద్రుల దర్శనం అది. ఆ దివ్యమైన అనుభూతిని గసాన్‌ పొందగలిగాడు.

గసాన్‌కు సంపూర్ణ జ్ఞానోదయం కలిగిందని కైసాన్‌ ధ్రువీకరిస్తూ... అతణ్ణి తన వారసుడిగా ప్రకటించాడు.

- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-10-28T05:32:37+05:30 IST