బోధనాసుపత్రుల్లో ఖాళీల భర్తీ: సత్యకుమార్
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:42 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను వాక్‌ఇన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో సూపర్ స్పెషాటీ కేటగిరికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం 682 పోస్టుల్లో 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ అర్హత కలిగిన 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎంపిక చేసి నియమించినట్లు చెప్పారు. ప్రస్తుతం గత ప్రభుత్వం మంజూరు చేసిన 157 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల్లో 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 160 ప్రొఫెసర్ పోస్టుల్లో 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వీటిని భర్తీ చేయడానికి వచ్చే వారం ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.