Rishi sunak: అదో అద్భుతం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-11-06T18:59:44+05:30 IST

యూకే ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌ విభిన్నతకు అద్దం పడుతోందని రిషి సునాక్‌ వ్యాఖ్యానించారు.

Rishi sunak: అదో అద్భుతం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: యూకే(UK) ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌ విభిన్నతకు అద్దం పడుతోందని రిషి సునాక్(Rishi Sunak) వ్యాఖ్యానించారు. ‘‘ఇది నిజంగా అద్భుతమే..’’ అని అన్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ బరిలో ఉన్నప్పటికీ తాను పోటీ నుంచి తప్పుకునేందుకు నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రిషితో పాటూ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే.. రిషికి మద్దతు వెల్లువెత్తడంతో చివరకు బోరిస్ తప్పుకున్నారు. బ్రిటన్ ప్రధాని అయిన తొలి హిందువుగా, అతి పిన్నవయస్కుడిగా రిషి రికార్డు సృష్టించారు.

ఇదీ చదవండి: ట్విటర్‌ దెబ్బకు హెచ్-1బీ వీసాదారుల్లో టెన్షన్.. 60 రోజుల డెడ్‌లైన్‌..

అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు కట్టుతప్పుతున్న పరిస్థితుల్లో బ్రిటన్‌ను ముందుండి నడిపించేందుకు తాను తగినవాడినని రిషి స్పష్టం చేశారు. బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా తాను పనిచేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రిగా తన అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా.. బ్రిటన్ ప్రధానిగా ఇటీవల ఆయన దీపావళి(Diwali celebrations) వేడుకల్లో పాల్గొన్నారు. ‘‘ఓ మంత్రిగా డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై నేను దీపాలను వెలిగించగలిగాను. బ్రిటన్‌లోనే ఇది సాధ్యమని చెప్పిన ఘటన ఇది. బ్రిటన్ దేశస్థులుగా మా అందరికీ ఇది గర్వకారణం’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గత ఎన్నికలకు సంబంధించి పలు విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. మాజీ ప్రధాని బోరిస్ రేసులో ఉన్నా కూడా తనకు పోటీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన తనకు రాలేదని చెప్పారు. ఆయనతో కలిసి జాయింట్ టిక్కెట్‌పై పోటీ చేయాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని తెలిపారు. ‘‘ఈ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. నా కొలీగ్స్ అందరూ నాకు మద్దతుగా నిలిచారు. ఈ బాధ్యతకు నేనే తగినవాడినని నాకు నమ్మకం ఉండేది.’’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు.R

Updated Date - 2022-11-06T19:03:46+05:30 IST