Wasim Akram: సలీం మాలిక్ నన్నో పనోడిలా చూసేవాడు: వసీం అక్రం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-11-28T21:24:46+05:30 IST

పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం (Wasim Akram) తన సహచర క్రికెటర్ సలీం మాలిక్‌ (Saleem Malik)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరియర్ తొలినాళ్లలో

Wasim Akram: సలీం మాలిక్ నన్నో పనోడిలా చూసేవాడు: వసీం అక్రం సంచలన వ్యాఖ్యలు
Wasim Akram

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం (Wasim Akram) తన సహచర క్రికెటర్ సలీం మాలిక్‌ (Saleem Malik)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరియర్ తొలినాళ్లలో తననో పనోడిలో చూసేవాడని పేర్కొన్నాడు. అక్రం 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లో కాలుమోపాడు. మాలిక్ తనతో మసాజ్ చేయించుకునేవాడని, అతడి దుస్తులు ఉతికించుకునే వాడని పేర్కొన్నాడు. అంతేకాదు, బూట్లను కూడా తనతో శుభ్రం చేయించుకునేవాడని పేర్కొన్నాడు. ఈ మేరకు తన బయోగ్రఫీ ‘సుల్తాన్: ఎ మొమోయిర్’లో పేర్కొన్నాడు. మాలిక్ కంటే తాను జూనియర్‌ను కావడం వల్లే తనతో ఈ పనులన్నీ చేయించుకునే వాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడెప్పుడూ ప్రతికూలంగా ఉండేవాడని, స్వార్థపరుడని ఆరోపించాడు. తనను బానిసలా చూసేవాడని ఆ పుస్తకంలో అక్రం రాసుకొచ్చాడు. మసాజ్ చేయాలని, దుస్తులు ఉతకాలని, బూట్లు క్లీన్ చేయాలని ఆర్డర్లు వేసేవాడని అన్నాడు.

తన కంటే చిన్నవాళ్లు అయిన సహచర ఆటగాళ్లు రమీజ్, తాహిర్, మోసిన్, షోయబ్ మహ్మద్ తనను నైట్‌క్లబ్బులకు ఆహ్వానించినప్పుడు తనకు కోపం వచ్చేదన్నాడు. అక్రం 1992 నుంచి 1995 వరకు మాలిక్ కెప్టెన్సీలో ఆడాడు. ఆ సమయంలో వీరిద్దిరి మధ్య సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. అక్రం చేసిన ఈ ఆరోపణలను మాలిక్ ఖండించాడు. తన పుస్తకాన్ని ప్రమోట్ చేసుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఆరోపణలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘‘నేను అతడితో మాట్లాడేందుకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. కానీ అతడు జవాబివ్వడం లేదు. ఇలా రాయడానికి వెనకున్న కారణం ఏంటని నేనతడిని అడుగుతాను’’ అని పాకిస్థానీ మీడియాతో మాలిక్ పేర్కొన్నాడు. నిజంగానే నాది సంకుచిత బుద్ధి అయితే, అసలతడికి జట్టులో చాన్స్ లభించేదే కాదన్నాడు. తనపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశాడో తప్పకుండా అడుగుతానని మాలిక్ పేర్కొన్నాడు.

Updated Date - 2022-11-28T21:27:49+05:30 IST