Draupadi Murmu: సమాజ పురోగతి.. అందరి కర్తవ్యం
ABN , First Publish Date - 2022-12-29T03:22:02+05:30 IST
సమాజ పురోగతి బాధ్యత ప్రభుత్వానిదో, సంబంధిత సంస్థలదో మాత్రమే కాదని.. అది ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

జాతరలతో సమాజ మూల విలువలు పటిష్ఠం
కొత్తగూడెం జిల్లాలో గిరిజన పూజారుల సమ్మేళనంలో రాష్ట్రపతి
భద్రాద్రిలో రామయ్య దర్శనం.. రామప్ప శిల్పకళకు అచ్చెరువు
నేడు సమతామూర్తి స్ఫూర్తికేంద్రానికి.. రేపు యాదాద్రికి ముర్ము
భద్రాచలం, యాదాద్రి, శంషాబాద్ రూరల్, భూపాలపల్లి, హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సమాజ పురోగతి బాధ్యత ప్రభుత్వానిదో, సంబంధిత సంస్థలదో మాత్రమే కాదని.. అది ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఆమె బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని రాజమండ్రికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో భద్రాద్రి ఆలయానికి చేరుకుని తన కుమార్తెతో కలిసి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. రామయ్య దర్శనానికి ముందు రూ.41.38 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. రామయ్య దర్శనం అనంతరం కూనవరం రోడ్డులోని వీరభద్ర ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించి, ప్రసంగించారు. విద్యార్ధులు చదువుపై దృష్టి సారించి.. స్వావలంబన సాధించాక తిరిగి సమాజ పురోగతికి దోహదపడాలని పిలుపు నిచ్చారు. సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు సమాజ మూల విలువలను పటిష్ఠం చేస్తాయని పేర్కొన్నారు.
తండ్రి మాటకు కట్టుబడి వనవాసం చేసిన శ్రీరాముడు నడియాడిన ఈ ప్రాంతంలో పర్యటించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆలయాల్లో సౌకర్యాల మెరుగునకు కేంద్ర పర్యాటక శాఖ ప్రసాద్ పథకం ద్వారా నిధులు కేటాయించటం అభినందనీయమన్నారు. ఈ పథకంతో సౌకర్యాలు మెరుగుపడి దేశ, విదేశీ పర్యాటకులు పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు, గిరిజన గ్రామాల అభివృద్ధికి వనవాసి కల్యాణ పరిషత్ చేస్తున్న కృషిని అభినందించారు. అంతకు ముందు.. ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రపతి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విద్యతోనే గిరిజన ప్రాంతాలఅభివృద్ధి సాధ్యమని.. దేశం కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని.. పలువురు ఆదివాసీ మహిళలు తమ సంప్రదాయ కళాకృతులను ద్రౌపది ముర్ముకు బహూకరించారు. కాగా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రామప్ప శిల్పకళ అద్భుతం..
భద్రాచల పర్యటన అనతరరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప ఆలయానికి చేరుకున్నారు. వేదపండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలోని శిల్పాలను ముర్ము వీక్షించారు. కాకతీయ హెరిటేజ్‌ట్రస్టీ పాండురంగారావు రామప్ప ఆలయ విశిష్టత గురించి రాష్ట్రపతికి వివరించారు. గుడిగోపురంపై ఉండే తేలియాడే ఇటుకలను నీటిలో వేసి రాష్ట్రపతికి చూపించారు. ఆలయ శిల్పాలను పరిశీలించిన రాష్ట్రపతి.. ‘రామప్ప శిల్ప కళ అద్భుతం’ అని కొనియాడారు. అనంతరం.. ప్రసాద్ పథకం కింద రూ.61.99కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. కాగా..రాష్ట్రపతి పర్యటన సమయంలో మీడియా గ్యాలరీవైపు ఉన్న స్ర్కీన్ వద్ద పొగలు వచ్చాయి. అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి ఆ మంటలను ఆర్పివేశారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన రాష్ట్రపతి
అనువాదకురాలిగా కొండరెడ్ల యువతి
అశ్వారావుపేట: భద్రాచలం పర్యటనలో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం విశేషం. తాను తెలుగు ఇంకా నేర్చుకోలేదంటూనే ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ గొప్పతనాన్ని తెలియజెప్పిన కవి దాశరథి కృష్ణమాచార్య గురించి ఆమె ప్రస్తావించారు. కాగా.. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని అనువదించే అవకాశం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని మారుమూల గ్రామం మొద్దులమడకు చెందిన కొండరెడ్డి విద్యార్థిని రేణుకకు దక్కింది. ప్రస్తుతం ఆమె హయత్‌నగర్‌లోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.