Ashok babu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగులు బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2023-10-11T15:00:34+05:30 IST
చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి
అమరావతి: ప్రతి అంశంపై రాజకీయ విమర్శలు చేసే మంత్రులు ఉద్యోగుల జీతాలపై ఎందుకు నోరు విప్పరు? అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు (tdp mlc Ashok babu) నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే.. జగన్ సర్కార్ నేటికి కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఎంతమందికి జీతాలు.. పింఛన్లు ఇచ్చారంటే ఆర్థిక శాఖ నీళ్లు నములుతోంది. అగ్నిపర్వతంలోని లావాలా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా దహిస్తారు. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమతో లేరని సకలశాఖల మంత్రి అన్నప్పుడే వారిపై జగన్ వైఖరి ఏమిటో అర్థమైంది. 13 లక్షల పైచిలుకు ఉద్యోగుల్లో కేవలం లక్షన్నర మందే నీలిరక్తం నింపుకున్నారనే నిజాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం పెట్టినంత మాత్రాన జగన్ అనుకున్నవి జరగవు.’’ అని అశోక్‌బాబు అన్నారు.