Share News

ఈశ్వరా.. పరమేశ్వరా

ABN , First Publish Date - 2023-11-14T00:08:17+05:30 IST

శైవక్షేత్రాలు ఇక శివనామ స్మరణతో మార్మోగనున్నాయి. మంగళవారం నుంచి కార్తీకం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని ఉమారుద్రకోటేశ్వరాలయం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునుడి దేవస్థానాలతో పాటు పల్లెల్లోని ఆలయాల్లోనూ కార్తీక శోభ సంతరించుకోనుంది.

ఈశ్వరా.. పరమేశ్వరా
రావివలస ఎండలమల్లన్న ఆలయం

- నేటి నుంచి కార్తీకం ప్రారంభం

- ముస్తాబైన శైవక్షేత్రాలు

శైవక్షేత్రాలు ఇక శివనామ స్మరణతో మార్మోగనున్నాయి. మంగళవారం నుంచి కార్తీకం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని ఉమారుద్రకోటేశ్వరాలయం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునుడి దేవస్థానాలతో పాటు పల్లెల్లోని ఆలయాల్లోనూ కార్తీక శోభ సంతరించుకోనుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పూజలు చేయనున్నారు. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని ప్రధాన శైవక్షేత్రాలు, వాటి విశిష్ఠత గురించి తెలుసుకుందాం.

.............

ఎండలమల్లన్న.. చల్లగ చూడన్నా

(టెక్కలి)

ఎండల మల్లికార్జున స్వామి.. భారతదేశంలోనే అతిపెద్ద సహజ శివలింగాల్లో ఒకటి. టెక్కలి మండలం రావివలసలో కొలువైన ఎండలమల్లిఖార్జునుడ్ని దర్శించుకునేందుకు ఆంధ్రాతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్లు దూరంలో ఉన్న రావివలస చేరుకునేందుకు బస్సులు, రైళ్లు, ఆటోలు వంటి సౌకర్యం కలదు. నౌపడా ఆర్‌ఎస్‌, టెక్కలి రైల్వేస్టేషన్ల నుంచి టెక్కలి చేరుకోవచ్చు. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం, ఇందిరాగాంధీ కూడలి నుంచి ఆటో సౌకర్యం, ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు మీద కూడా రావివలస చేరుకోవచ్చు. వాహన పార్కింగ్‌ ప్రాంతాల నుంచి ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయానికి సుమారు కిలోమీటరున్నర దూరం భక్తులు నడవాల్సి ఉంటుంది.

- సాగుతున్న ఆలయ పనులు

ఎండలమల్లన్న ఆలయంలో ఆరేళ్లుగా సీజీఎఫ్‌ నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2కోట్లతో ప్రాకార మండప పనులు, ఈ ప్రభుత్వ హయాంలో రూ.70లక్షలతో నూతన శీర్షాభిషేక మండపం, ప్రాకార మండపానికి సంబంధించి ఫినిషింగ్‌, కేశఖండనశాల నిర్మాణ పనులు చేశారు. ప్రాకార మండపంలో ఉప ఆలయాలు, నవగ్రహ మండపం, హోమ మండపం, ఎండలమల్లన్న లింగం చుట్టూ రైలింగ్‌ పనులు పూర్తికాలేదు. ఆలయానికి పూర్తిస్థాయిలో విద్యుదీకరణ, కేశఖండనశాల ఫిన్సింగ్‌, అర్చక క్వార్టర్స్‌, హంగులతో కార్యాలయ గది, మరుగుదొడ్లు, పూర్తిస్థాయి తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఏడాదిన్నరగా ట్రస్ట్‌బోర్డు నియామకం చేపట్టకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఆలయ ఈవో బదిలీ కావడంతో ఇన్‌చార్జి పాలన కొనసాగుతోంది.

ముక్తికి మార్గం శ్రీముఖలింగం

జలుమూరు: శ్రీముఖలింగం.. ఎంతోమంది పవిత్ర జీవులు ఈశ్వరుడి సాక్షాత్కారాన్ని పొంది తరించిన దివ్యక్షేత్రం. అందుకే కుమారస్వామి అగస్త్య మహర్షికి ఈ క్షేత్రం కాశీకి తుల్యమైనదిగా అభివర్ణించారు. అప్పటినుంచి శ్రీముఖలింగం.. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. శ్రీముఖలింగం అనగా పరమేశ్వరుడి ముఖం.. లింగంలో కనిపించుట అని అర్థం. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసిన మోక్షం సిద్ధిస్తుందని శాసనాలు చెబుతున్నాయి. జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని మూడుచోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు వెలిశాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వరాలయం. దీనికి అభిముఖంగా కొంతదూరంలో భీమేశ్వరాలయం ఉంది. ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా.. గ్రామం ప్రారంభంలో అద్భుత సోయగాలు కురిపిస్తు సోమేశ్వరాలయం భక్తులను ఆహ్వానిస్తోంది. ఏటా కార్తీకమాసం పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించి పూజలు చేయనున్నారు. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయ ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు.

సమస్యల తిష్ఠ

శ్రీముఖలింగం వచ్చే పర్యాటకుల కోసం పదేళ్ల కిందట విశ్రాంతి భవనం నిర్మించారు. కానీ, ఇప్పటికీ ప్రారంభించక పోవడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది. దీంతో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేకుండా పోయింది. మరుగుదొడ్ల సమస్య పట్టి పీడిస్తోంది. ఆలయానికి ఎదురుగా కళామండపానికి సమీపంలో నిర్మించిన మరుగుదొడ్లు మరుగున పడ్డాయి. ఇప్పటికైనా పర్యాటకుల విశ్రాంతి భవనం ప్రారంభించి, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

..............

బలరాముడు ప్రతిష్ఠించిన కోటేశ్వరాలయం

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళంలోని గుడివీధిలో నాగావళి నది ఒడ్డున వెలసిన ఉమారుద్ర కోటేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు ఐదువేల ఏళ్ల కిందట బలరాముడు దీనిని ప్రతిష్ఠించారు. పంచ లింగ క్షేత్రాల్లో ఇదొకటి. ఉమారుద్ర కోటేశ్వరాలయంతోపాటు బలగలో మణి నాగేశ్వరాలయం, బోడెమ్మ కోవెల వద్ద జీవేశ్వరాలయంలో భక్తులు నదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకుంటారు.

ఆరు నెలలు నీటిలోనే.. నీలకంఠేశ్వరుడు

పాతపట్నం: నీలకంఠేశ్వరుడు.. ఏడాదిలో ఆరునెలల పాటు నీటిలో నుంచే భక్తులకు దర్శనమిస్తాడు. పాతపట్నంలోని మహేంద్రతనయ నదీ తీరాన నీలకంఠేశ్వరుడు స్వయంభుగా వెలిశాడు. ఆలయ గర్భగుడిలోకి మహేంద్రతనయ నదీ జలాలు చేరుతాయి. ఈ నేపథ్యంలో ఏటా జూలై నుంచి డిసెంబరు వరకు నదీ జలాల మధ్యే నీలకంఠేశ్వరుడు పూజలందుకుంటాడు. 13వ శతాబ్దంలోని ఒడిశాకు చెందిన పర్లాకిమిడి గజపతి రాజుల హయాంలో నీలకంఠేశ్వర ఆలయాన్ని నిర్మించారు. చారిత్రాత్మిక ఆలయాల్లో ఇదొకటి. మహేంద్రతనయ నదీ తీరాన ఇసుకలో విభూది.. సహజ పంటగా పండేది. ఆలయ చేరువలో గన్నేరు తులసి, మారేడుదళాల వనాలు పరిమళాలు ఆహ్లాదపరిచేవి. ఆలయం చుట్టూ ఒడిశా సంప్రదాయ శిల్పకళా సంపద ఉట్టిపడుతోంది. ఈ ఆలయంలో లోకనాథేశ్వరస్వామి, కేదారీశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, బాలికేశ్వరస్వామి, కాశీ విశ్వేరస్వామి ఉప ఆలయాలను నిర్మించారు. అందుకే దీనిని పంచలింగేశ్వరాలయమని కూడా పిలుస్తారు. అలాగే ఇక్కడ పార్వతీదేవి ఆలయాన్ని కూడా ఆకర్షణీయంగా నిర్మించారు.

ఒక్కడే దేవుడు.. మూడు రూపాల్లో పూజలు

సోంపేట : ఏ దేవాలయంలోనైనా భగవంతుడిని ఒక్క రూపంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. కానీ సోంపేట మండలం పలాసపురంలో వెలసిన కపిలేశ్వర విరంచి నారాయణస్వామి దేవాలయంలో శివుడినే వేర్వేరు కాలాల్లో మూడు రూపాలుగా కొలుస్తుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణ రోజుల్లో కపిలేశ్వరుడిగా దర్శనమిచ్చే శివుడు.. ధనుర్మాసంలో బ్రహ్మగా, పుష్యమాసంలో విష్ణువుగా పూజలందుకోవడం విశేషం. మామూలుగా శివుడికి విభూది, బిల్వపత్రాలను అభిషేకిస్తారు. కానీ ఇక్కడ భక్తులు విభూదితోపాటు ప్రత్యేక రోజుల్లో పుష్యమాసంలో మహిళలు చీపురులను కానుకగా అందజేస్తారు. అలాగే తెల్ల ఆవాలు, చోళ్ళు(రాగులు) సైతం దానంగా ఇస్తారు. దేవుడికి ప్రసాదంగా నెయ్యిముద్దలనే కాకుండా బూడిద గుమ్మడికాయలను ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. వృద్ధులు, చిన్నపిల్లలతో ఈ బూడిద గుమ్మడి కాయలను దానంగా ఇప్పిస్తారు. ఇలా చేస్తే రోగాలు ఉన్నా నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆలయాన్ని దర్శించిన భక్తులు ఆవాలను గుడిచుట్టూ చల్లడం ఆచారంగా వస్తోంది. ఇలా చల్లితే, ఆ దేవుడి దయవల్ల తమ ఇంటికి చెడుగాలి సోకదని భక్తుల నమ్మకం.

ఏకశిలాపర్వతంపై మల్లికార్జునుడు

జి.సిగడాం: మల్లికార్జున స్వామి.. జి.సిగడాం మండలం మెట్టవలసలో ఏకశిలా పర్వతంపై కొలువయ్యాడు. సహజ సిద్ధంగా వెలసిన రాతికొండపై ఉన్న శివలింగం దశాబ్దాలుగా పూజలందుకుంటోంది. దాదాపు వందేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కొండపై భాగం నుంచి చుట్టూ కనిపించే దృశ్యాలు కనువిందు చేస్తాయి. రాజాం- శ్రీకాకుళం ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయానికి కార్తీకమాసంలో భక్తులు భారీగా తరలివస్తారు. మల్లికార్జునుడిని దర్శించుకుంటే పాపకర్మల నుంచి విముక్తి లభిసుందని భక్తుల నమ్మకం. కొండ దిగువ భాగం నుంచి 220 మెట్లు ఎక్కి మల్లికార్జునుడ్ని దర్శించుకోవాలి. కొండపైన ఆలయానికి దగ్గరలో ఉన్న పాతాళ బావిలో నిత్యం జలం ఉంటుంది. పార్వతీపరమేశ్వరులు పాతాళ గంగలో స్నానం ఆచరించి.. ఏకశిలా పర్వతంపై సేదతీర్చుకునేవారని పూర్వీకులు చెబుతున్నారు. పెళ్లికాని వారు ఇక్కడ పరమేశ్వరుడిని దర్శించుకుంటే వివాహాలు అవుతాయని, శుభ పరిణామాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.

Updated Date - 2023-11-14T00:08:18+05:30 IST