AP News: జూదంలో ఘర్షణ.. ఒకరిపై ఒకరు దాడి.. చివరకు..
ABN , First Publish Date - 2023-03-03T12:36:09+05:30 IST
క్షణికావేశాలు మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. చిన్న చిన్న గొడవలకే చంపుకునే స్థాయికి వెళ్లిపోతున్నారు.
శ్రీకాకుళం: క్షణికావేశాలు మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. చిన్న చిన్న గొడవలకే చంపుకునే స్థాయికి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పేకాటలో జరిగిన గొడవకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని బూర్జ మండలం ఓవీపేటలో ఈ ఘటనచోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న కొందరు పేకటా ఆడారు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు... జూదంలో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. జమ్మాన సుదర్శనరావు అనే వ్యక్తిపై హోంగార్డు రామారావు దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సుదర్శనరావు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం నీలంపేటగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గ్రామ సమీప తోటల్లో అధికార పార్టీ నేతల అండతో పేకాట శిబిరం నడుస్తున్నట్లు సమాచారం.